ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయాన్ని ఆపలేరని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైటెక్స్ ప్రాంగణంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో పోటీ చేస్తున్నారని, ఇది నిజం కాదని చెప్తే.. అందుకు సంబంధించిన సాక్ష్యాలను తానే బయటపెడుతానని స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో చీకటి ఒప్పందం చేసుకున్నట్టే.. ఇవాళ హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీని నిలువరించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా విజ్ఞులయిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారన్నారు.
మాణిక్యం ఠాకూర్ రూ.50 కోట్లకు పీసీసీ పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విమర్శలపై ఇప్పటివరకు రేవంత్ రెడ్డి నోరు విప్పలేదని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా వ్యాఖ్యానించారని కేటీఆర్ తెలిపారు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీకి ఓటేయమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఎంతమంది.. ఎన్ని పార్టీలు ఒక్కటైనా హుజురాబాద్ ప్రజలు గెల్లు శ్రీనివాస్ నే గెలిపిస్తారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.