mt_logo

ఒరిజినల్, డూప్లికేట్ తేడాలుండవు-జైరాం రమేష్

రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లు అసలైనది కాదని, డూప్లికేట్ బిల్లని సీఎం వ్యాఖ్యానించడంపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ అసహనం వ్యక్తం చేశారు. బిల్లులో ఒరిజినల్, డూప్లికేట్ అని తేడాలుండవని, కరెన్సీలో ఉంటాయని తెలుసని సీఎం కిరణ్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అసెంబ్లీకి అసలు బిల్లు రాలేదని సీఎం మాట్లాడటంపై ఆయన స్పందిస్తూ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లును మాత్రమే రాష్ట్రపతి అసెంబ్లీకి పంపారని, దాన్ని దాచిపెట్టుకుని వేరే బిల్లును పంపలేదని చెప్పారు. అసలు ఈ చర్చేంటో తనకు అర్థం కావట్లేదని, బిల్లుపై వింతవాదనలు చేయడం కరెక్ట్ కాదని, జనవరి 30వరకే బిల్లు అసెంబ్లీ పరిధిలో ఉంటుందని, సాధ్యమైనంత త్వరగా చర్చ ముగించి బిల్లును కేంద్రానికి పంపాల్సి ఉంటుందని సభ్యులకు సూచించారు. బిల్లు కేంద్రానికి వచ్చాక తగిన సవరణలు చేయడానికి మరోసారి జీవోఎం సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. అవసరమైన సవరణలు చేశాక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడ్తామని, అప్పుడు బిల్లు ఆమోద ప్రక్రియ మొదలవుతుందని జైరాం రమేష్ వివరించారు. బిల్లు రాజ్యాంగబద్ధంగానే తయారైందని, ఆర్టికల్ 3 ప్రకారమే బిల్లును తయారుచేశామని మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీకి అభిప్రాయ సేకరణ అధికారం మాత్రమే ఉంటుందని, సభ్యుల ఏకాభిప్రాయం రాష్ట్రాల ఏర్పాటు విషయంలో అవసరం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *