mt_logo

సీఎం కిరణ్ డౌన్ డౌన్!

తెలంగాణ బిల్లును వెనక్కు పంపాలని సీఎం ఇచ్చిన నోటీసుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత మంత్రులు సోమవారం అసెంబ్లీలో సీఎం కిరణ్‌పై తిరుగుబాటు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి సభ జరక్కుండా అడ్డుకున్నారు. దీంతో సోమవారం సభ జరక్కుండానే మరుసటి రోజుకు వాయిదా పడింది. మంత్రులకు సంఘీభావంగా అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సైతం సీఎంకు వ్యతిరేకంగా నిలబడి ఎట్టిపరిస్థితుల్లోనూ నోటీస్‌ను ఆమోదించవద్దని స్పీకర్‌ను కోరారు. ఇన్నాళ్ళూ చర్చించిన తెలంగాణ బిల్లును ఇప్పుడు వెనక్కు తిప్పిపంపాలని సీఎం కోరడంపై తెలంగాణ ప్రాంత మంత్రులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ముఖ్యమంత్రి అసలు తమ నాయకుడే కాదని దామోదర రాజనర్సింహ పేర్కొనగా, సీఎంపై అవిశ్వాస తీర్మానం పెడతామని మంత్రి డీ.శ్రీధర్‌బాబు అన్నారు. బిల్లు రాష్ట్రపతినుండి అసెంబ్లీకి చేరిన రోజునుండి రెండు ప్రాంతాల నేతల మధ్య చీలికలు వచ్చాయి. కానీ అవెప్పుడూ తారాస్థాయికి చేరుకోలేదు. ఎప్పుడైతే బిల్లును వెనక్కు పంపాలని సీఎం నోటీస్ ఇచ్చారో అప్పట్నుంచీ తెలంగాణ ప్రాంత మంత్రులు సీఎంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఢిల్లీ స్థాయిలోని నాయకులు కూడా సీఎం ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శిస్తుండటంతో ఎలాగైనా కిరణ్‌ను కట్టడిచేయాలని తెలంగాణ ప్రాంత మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రమంత్రి జైరాం రమేష్ కూడా సీఎం తీరుపై మండిపడుతున్నారు. రాజ్యాంగంపై సీఎంకు అవగాహన ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకపక్క జాతీయ నాయకత్వం ఒరవడిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుంటే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మాత్రం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ త్వరలో జరిగే ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *