mt_logo

జేపీ రంగు బహిరంగం


ఐబీఎంపై అభూత కల్పనలు..
కచ్చెడు అబద్ధాలు..
తెలంగాణపై కక్ష..

– ‘ప్రత్యేక’ ఆకాంక్షపై ఆది నుంచీ అదే తీరు..!
– కల్లబొల్లి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం
– ఉద్యోగుల వలస ముమ్మాటికి అవాస్తవం
– వార్షిక షట్‌డౌన్‌లో భాగంగానే వెళ్లివస్తున్నారు
– మాకు ఏ ఉద్యమంతో సంబంధం లేదు
– సకల జనుల సమ్మె నాడు కూడా పనిచేశాం
– తేల్చిచెబుతున్న ఐబీఎం వర్గాలు
– ‘సురాజ్యం’ అధినేత..! ఇప్పుడేమంటారు?
– 850 మంది బలిదానాలు మీ లెక్కకు రాలేదా?
– ప్రశ్నిస్తున్న తెలంగాణవాదులు


హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆయనో పార్టీకి అధినేత..! ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనే..! సందుదొరికినప్పుడల్లా తెలంగాణపై నోరుపారేసుకుంటారు. సందుదొరకకపోతే.. కల్పించుకొని మరీ దూరిపోతారు..! అవాకులు చెవాకులతో రెచ్చిపోతారు..! తోచిన నివేదికలు వెంటబెట్టుకొని హస్తినకు పయనమవుతారు. తాను చెప్పిందే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేదమని సంబరపడతారు..! ‘సురాజ్యం’ పేరిట జెండా ఎత్తుకొని చక్కర్లు కొడతారు.. కానీ, ‘స్వరాజ్యం’ కోసం కొట్లాడుతున్న నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఆయన కంటికి ఏనాడూ ఆనదు..! దశాబ్దాలుగా తెలంగాణలో పాగావేసిన వివక్షల రాజ్యంపై ఆ పెద్దాయన ఊసే ఎత్తరు..! ప్రత్యేక రాష్ట్రం కోసం 850 మంది ప్రాణాలొదిలినా ఆయనకు అది లెక్కేకాదు..! ప్రతిరోజూ 60 మంది ఐబీఎం కంపెనీ ఉద్యోగులు హైదరాబాద్‌ను విడిచి వెళ్తున్నారన్నది మాత్రం ఆయనకు తెలిసిన లెక్కట..! అదీ తెలంగాణ ఉద్యమానికి బెడిసి ఉద్యోగులు విమానంలో బెంగళూరు బాటపట్టారట..! దీన్నే శాసనసభ సాక్షిగా ఆయన గగ్గోలు పెట్టారు..!

గొంతుచించుకున్నారు..! తెలంగాణ ఉద్యమం వల్ల ఐబీఎం సంస్థ ప్రాజెక్టులను నడుపుకోలేక, హైదరాబాద్‌లోని ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోందని పాపం.. చలించిపోయారు..! సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వలస వెళ్లారంటున్న ఆ అధినేత ఎవరో ఇప్పటికే తెలిసుండాలి..! ఆయనే లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్.. ఉరఫ్ జేపీ. ఆయనకు కనిపించి ఉద్యోగుల వలసలు ఎంతవరకు వాస్తవం..?! అది ముమ్మాటికి పచ్చి అబద్ధమని ఐబీఎం కంపెనీ వర్గాలే అంటున్నాయి. ‘ఇది చాలా చిన్న విషయం. ఒక్క మేమే కాదు, ఇలాంటి సేవలందించే ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌పీ లాంటి సంస్థల్లో కూడా ఇది చాలా మామూలు కార్యక్రమం. పూర్తిగా కంపెనీ వ్యాపార సంబంధమైన అంతర్గత సర్దుబాటు చర్య. తెలంగాణ లేదా ఏ ఇతర ఉద్యమాల కారణంగా మేము మా ఉద్యోగులను వేరే ప్రాంతాలకు తరలించలేదు. ఉద్యమాల వల్ల మా కార్యకలాపాలకు కూడా ఇప్పటివరకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు. సకలజనుల సమ్మె ఉధృతంగా ఉన్న రోజుల్లోనూ మేం ఒక్కరోజు కూడా వర్క్‌ను ఆపుకోలేదు. ఉద్యోగులు తరలిపోతున్నారంటున్న జేపీ ఆరోపణలు పచ్చి అబద్ధం. మమ్మల్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం బాధాకరం’ అని ఐబీఎం కార్పొరేషన్, హైదరాబాద్ ఉన్నతాధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.

ఇంతకీ జరిగిందేమిటి..?

ప్రపంచ ప్రఖ్యాత కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) కార్పొరేషన్, కేవలం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల అమ్మకాలే కాకుండా అప్లికేషన్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, బిజినెస్ కంటిన్యుటీ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, బిజినెస్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ లాంటి పలురకాల సేవలు ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారులకు అందిస్తుంటుంది. అందులో భాగంగా భారత్‌లో ఏడు గ్లోబల్ డెలివరీ సెంటర్లను(జీడీసీ) నెలకొల్పి, వాటి ద్వారా జాతీయ, అంతర్జాతీయ వినియోగదారుల ప్రాజెక్టులకు నిరంతరాయంగా ఏడాది పొడవునా ‘రౌండ్ ది క్లాక్’ సేవలందిస్తోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పుణె, హైదరాబాద్, చెన్నై, గుర్‌గావ్‌లలో ఈ ఏడు జీడీసీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ కూడా అత్యాధునిక సర్వర్లు, కంప్యూటర్లు, ఇతర సమాచార మార్పిడి వ్యవస్థలు, అత్యంత వేగవంతమైన డెడికేటెడ్ లైన్ల ద్వారా అనుసంధానించబడ్డాయి. ప్రతీ సెంటర్ కూడా తమకు కేటాయించిన ప్రాజెక్టులను పూర్తిచేసే క్రమంలో భారత్‌లో ఉన్న ఇతర సెంటర్‌లను కానీ, అంతర్జాతీయ కేంద్రాలను కానీ నిత్యం సంప్రతిస్తుంటాయి. ఈ ఏడు కేంద్రాలలో అత్యాధునిక డేటా సెంటర్లున్నాయి. అయితే సంవత్సరం పొడవునా నిరంతరాయంగా పనిచేసే ఈ డేటా సెంటర్ల పనితీరును సమీక్షించేందుకు, ఏవైనా లోపాలుంటే సరిదిద్దేందుకు ఏడాదికి ఒకరోజు పూర్తిగా ఆపివేసి, అన్ని రకాల సర్వర్లు, కంప్యూటర్లు, రౌటర్లు, స్విచ్‌లు తదితర సామాక్షిగినంతా మెయింటెనెన్స్ చేసి తిరిగి కండిషన్‌లో పెడతారు. దీన్నే ‘ఆన్యువల్ షట్‌డౌన్’ అని వ్యవహరిస్తారు. ఆ రోజు డేటాసెంటర్ పనిచేయనందున చేతిలో ఉన్న ప్రాజెక్టు పని కూడా నిరంతర వ్యాపార సేవల్లో భాగం కనుక తాత్కాలికంగా ఆ పనిని, దానిపై పనిచేస్తున్న వారిని దేశంలోని ఇతర కేంద్రాలకు తరలిస్తారు.

హైదరాబాద్‌లో కూడా ఇదే జరిగింది. 2005లో హైదరాబాద్‌లో ఐబీఎం తన శాఖను ఏర్పాటు చేసి, సేవలను మరింత విస్తరించింది. ఇక్కడ మూడు క్యాంపస్‌లలో దాదాపు 7500కు పైగా ఉద్యోగులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్ గ్లోబల్ డెలివరీ సెంటర్ తమ ఆన్యువల్ షట్‌డౌన్‌ను ప్లాన్ చేసుకొని, తదనుగుణంగా 40 నుంచి 45 మంది ఉద్యోగులను నిరంతర వ్యాపార సేవలో భాగంగా బెంగళూరు సెంటర్‌కి పంపింది. వెళ్లినవాళ్లు ఇదే పనిని అక్కడి సెంటర్లో చేసి, ఇక్కడి నెట్‌వర్క్ అంతా సిద్ధమవగానే తిరిగి వచ్చేశారు కూడా. ఇలాగే హైదరాబాద్ సెంటర్ కూడా వేరే సెంటర్ల పనికి చాలాసార్లు ఆతిథ్యం కల్పించింది.

కానీ, జేపీకి కనిపించిందేమిటి?

తెలంగాణ ఉద్యమ భయంతో హైదరాబాద్‌లోని ఐబీఎం కంపెనీ నుంచి ప్రతిరోజూ 60 మంది ఉద్యోగులు బెంగళూరుకు వలస వెళ్తున్నారని, ప్రాజెక్టులను నడుపుకోలేక ఆ సంస్థే వారిని పంపించిందని జయవూపకాశ్ నారయణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18న అసెంబ్లీలో కూడా దీనిపై గగ్గోలు పెట్టారు..! ఆన్యువల్ షట్‌డౌన్‌లో భాగంగా ఐబీఎం కంపెనీ ఉద్యోగులు బెంగళూరు వెళ్లితే.. జేపీకి మాత్రం ఉద్యమ దెబ్బకు వెళ్లారన్నట్లు కనిపించిందట..! ఐబీఎం తన ప్రాజెక్టులను కూడా నడుపుకోలేకపోతున్నట్లు తెలిసిందట..! జేపీ వ్యాఖ్యలను అసెంబ్లీలో ఆరోజే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తూర్పారబట్టారు. ‘ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో వందలాది మంది బిడ్డలు ప్రాణాలు వదులుతుంటే దాన్ని కాదని ఐబీఎం కంపెనీ ఉద్యోగులను విమానంలో తీసుకెళ్లిన విషయం సభలో చెప్పడం ఏమిటి? ’ అని కడిగిపారేశారు. జేపీ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు రగిలిపోతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆది నుంచి అడ్డుతగులుతున్న జేపీ… ఇలా రెచ్చగొట్టి మాట్లాడటం మంచిపద్ధతి కాదని వారు హెచ్చరిస్తున్నారు. కడుపులోని అక్కసును అబద్ధాల లెక్కలతో బయటపెడితే ఊరుకోబోమని హైటెక్ సిటీలోని వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. సురాజ్యం పేరిట ముందుకు రాగానే సరిపోదని, తెలంగాణలో స్వరాజ్యం కోసం పోరాడుతున్న ప్రజల ఆకాంక్షను గుర్తించాలని హితవుపలుకుతున్నారు. కల్లబొల్లి మాటలతో శాసనసభను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నం చేసిన జయప్రకాశ్ నారాయణ్.. తన ఆరోపణను నిరూపించాలని, లేదా అదే శాసనసభలో సభ్యులను, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి క్షమాపణ కోరాల్సిందిగా టీజేఏసీ నాయకుడొకరు డిమాండ్ చేశారు.
[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *