ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పథకాన్ని గెలుచుకుంది. ఈ మెగా చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా ఆడిన నిఖత్ ఫైనల్లో గోల్డ్ మెడల్ గెలిచి యావత్ దేశం గర్వపడేలా చేసింది. గురువారం ఇస్తాంబుల్ వేదికగా జరిగిన మహిళల 52కిలోల ఫైనల్ పోరులో నిఖత్ 5-0 తేడాతో థాయ్‌లాండ్ బాక్సర్ జిట్‌పాంగ్ జుటామస్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. మూడు రౌండ్ల పాటు జరిగిన పసిడి పోరులో జరీన్ 30-27, 29-28, 29-28, 30-27, 29-28తో జిట్‌పాంగ్ సంపూర్ణ ఆధిక్యంతో గెలుపును ఖరారు చేసుకుంది.
తొలి రౌండ్ నుంచి తనదైన ఆధిక్యం కనబరిచిన నిఖత్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పదునైన పంచ్‌లతో విరుచుకుపడి… రెండో, మూడో రౌండ్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి ఎంత కవ్విస్తున్నా.. వెరువని నైజంతో ముందుకు సాగిన నిఖత్ విజయంపై ఆత్మవిశ్వాసంతో కనిపించింది. బౌట్ ముగిసి రిఫరీ విజేతను ప్రకటించగానే జరీన్ దిక్కులు పిక్కటిల్లేలా విజయనాదం చేసింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అందరికీ అభివాదం చేసింది. చిరకాల కల సాకారమైన వేళ నిఖత్ గెలుపు గర్వంతో అభిమానులకు చేతులు ఊపుతూ ముందుకు సాగింది. మొత్తంగా ప్రపంచ బాక్సింగ్ టైటిల్ దక్కించుకున్న తొలి తెలుగు బాక్సర్‌గా నిఖత్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా మెగాటోర్నీలో నిఖత్‌కు స్వర్ణం దక్కగా, పర్వీన్, మనీషాకు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మొత్తం పదకొండు ఎడిషన్లలో బరిలోకి దిగిన భారత్ ఇప్పటి వరకు 39 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 10 స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, 21 కాంస్య పతకాలు ఉన్నాయి.