కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని, ఆయన చూపిన బాటలోనే తాము నడుస్తున్నామని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపిందని మంత్రి తెలిపారు. అంబేద్కర్ లక్ష్యం సమానత్వం అన్నారు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే, దాన్ని తానే ముందుగా తగులబెడుతానని అన్నారని మంత్రి గుర్తు చేశారు. భాషా ఆధిపత్యాన్ని, ప్రాంతీయ ఆధిపత్యాన్ని అంబేద్కర్ వ్యతిరేకించినట్లు మంత్రి తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్, టెంపుల్ ఆఫ్ డెమాక్రసీకి పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు కాబట్టి.. అందుకే అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ తన తీర్మానంలో కోరారు.
కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలుపడానికి తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో దేశ నిర్మాణం సాగాలన్న అంబేద్కర్ ఆశయాలను భట్టి గుర్తు చేశారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదని, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే, కేంద్రం ఐటీ దాడులతో భయపెడుతోందని భట్టి ఆరోపించారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి, ఇతర నేతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ మిత్రులు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే బాగుండేదన్నారు. పంజాగుట్టలో విగ్రహం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గుర్తు పెట్టుకునే రీతిలో నిర్మిస్తున్నామన్నారు. ట్యాంక్‌బండ్ సమీపంలో ఆ విగ్రహ నిర్మాణం సాగుతోందన్నారు. పంజాగుట్టలో జరిగిన సంఘటనల గురించి మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. గతంలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని తానేమీ కాదనడం లేదని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. కానీ అక్కడకు కూతవేటు దూరంలోనే 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.