mt_logo

త్వ‌ర‌లో నూత‌న‌ గ్రామ పంచాయ‌తీలకు కొత్త భ‌వ‌నాలు

రాష్ట్రంలో ప‌రిపాల‌నా సౌల‌భ్యం – సంస్క‌ర‌ణ‌ల‌లో భాగంగా ఏర్పాటైన నూత‌న‌ గ్రామ పంచాయ‌తీల‌న్నింటికీ, సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను ద‌శ‌ల వారీగా నిర్మిస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ లు తెలిపారు. అలాగే భ‌వ‌నాలు లేని పాత గ్రామ పంచాయ‌తీల్లోనూ కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తామ‌న్నారు. ఈ విష‌య‌మై నిధులు, విధి విధానాలు, ప్ర‌ణాళిక‌లు వంటి ప‌లు అంశాల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లోని త‌న నివాసంలో గురువారం చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజ‌న సంక్షేమ‌శాఖ కార్య‌ద‌ర్శి క్రిష్టినా జెడ్ చొంగ్తు, పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావు, పంచాయ‌తీరాజ్ ఇఎన్ సి సంజీవ‌రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ లు మాట్లాడుతూ… రాష్ట్రంలో 12వేల 769 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయ‌ని, అందులో గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాలు లేని తండాలు 1 వెయ్యి 97 ఉండ‌గా, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయ‌ని చెప్పారు. అలాగే 2వేల 960 మైదాన ప్రాంత గ్రామ‌ పంచాయ‌తీల్లో భ‌న‌వాలు లేవ‌న్నారు. మొత్తం 4వేల 745 గ్రామ పంచాయ‌తీల‌కు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం ఉంద‌న్నారు. అయితే వీటిలో ఇప్ప‌టికే సంబంధిత ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుండి అందిన ప్ర‌తిపాద‌న‌లు, ఇంకా ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి అందాల్సిన ప్ర‌తిపాద‌న‌ల‌ను బ‌ట్టి ద‌శ‌ల వారీగా తండాల‌కు, ఏజెన్సీ ఆవాసాల‌కు, ఇత‌ర గ్రామాల‌కు ప్రాధాన్య‌తా క్ర‌మంలో కొత్త గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను మంజూరు చేసి, పంచాయ‌తీరాజ్‌, గిరిజ‌న సంక్షేమ‌శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో వేగంగా నిర్మిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే కొన్ని గ్రామాల్లో కొత్త భ‌వ‌నాల ప‌నులు ప్ర‌గ‌తిలో ఉన్నాయ‌ని, ఇంకా మిగ‌తా అన్ని కొత్త భ‌వ‌నాల‌ను కొత్త గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *