mt_logo

ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పోటెత్తుతున్న కొత్త అడ్మిషన్లు

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కొత్తగా స్కూళ్లలో చేరనున్న విద్యార్థులు అధికంగా ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది తల్లితండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే 1,60,755 మంది విద్యార్థులు కొత్తగా సర్కారు స్కూళ్లల్లో చేరగా… వీరిలో అధికంగా ఇంగ్లిష్‌ మీడియంలోనే చేరడం గమనార్హం.ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతిష్ఠాత్మకంగా అన్ని బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం కూడా ఇందుకు దోహదపడుతున్నది. కాగా ప్రభుత్వ బడుల్లో నమోదును పెంచేందుకు చేపట్టిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట సైతం సత్ఫలితాలనిస్తున్నది. ఈ నెల 30తో బడిబాట కార్యక్రమం ముగియనుండగా… ఆ తర్వాత అడ్మిషన్లు జరుపుతామని అధికారులంటున్నారు. అడ్మిషన్ల తాకిడికి పలు పాఠశాలల్లో నో అడ్మిషన్‌ బోర్డులు పెట్టాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. సిద్దిపేట ఇందిరానగర్‌ పాఠశాలలో ఇటీవల దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన వారి సందడి జాతరను తలపించింది. ఇక హైదరాబాద్‌లోని బోరబండలోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల తాకిడి తట్టుకోలేక గేట్స్‌ మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా రాష్ట్రంలోని 200 బడుల్లో అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉంది. ప్రభుత్వ బడుల్లో ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతుండటం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను అందజేస్తుండటం, తాజాగా ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులంతా సర్కారు స్కూళ్లనే ఎంచుకుంటున్నారు. మరోవైపు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలోనూ గతంలో ఎన్నడు లేనంతగా అడ్మిషన్ల తాకిడి మొదలయ్యింది. 6వ తరగతి అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. ఎస్సెస్సీ వరకు 200 మంది, ఇంటర్‌ వరకు 360 మంది సామర్థ్యంతో కేజీబీవీలను నిర్వహిస్తుండగా… వెల్లువెత్తుతున్న డిమాండ్‌తో పలు కేజీబీవీల్లో సీట్ల సంఖ్యను పెంచారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు కావడంతో విద్యార్థులకు వసతి సమస్య తలెత్తనుండటంతో అడ్మిషన్లు తీసుకోలేమని అధికారులు అంటున్నారు. కేజీబీవీల్లో సైతం ఉచిత విద్యనందిస్తుండటం, వీటిల్లోని విద్యార్థులంతా ఆటలు, క్రీడలు, చదువుల్లో రాణిస్తుండటంతో వీటిల్లో చేరేందుకు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *