– గుబాళించనున్న సాంస్కృతిక పరిమళం
తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ నేటినుంచి ప్రారంభమవుతున్నది. పెత్రఅమావాస్య నుంచి తొమ్మిది రోజుల పూల ధూంధాం జాతరకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ఈ సంబురంలో పాలు పంచుకునేందుకు తంగేడు, బంతి, చామంతి, గుమ్మడి, దోస, గునక, జిల్లేడు, మందార పూలు చెట్ల మీద పురి విప్పుకుని పిలుస్తున్నాయి. తంగేడు ఆకులు, దోస ఆకులు నేనంటే నేనని పోటీ పడుతున్నాయి. చెరువులు కడుపునిండా నీరు నింపుకుని బతుకమ్మలకు అలల ఉయ్యాలలు సిద్ధం చేశాయి. వెదురు సిబ్బిలు ఇంటికి చేరుతుంటే.. రాగి తాంబాళాలు అటక మీదినుంచి కిందికి దిగుతున్నాయి. అల్మారలో పట్టుచీరలు ఏడాది విరహానికి వీడ్కోలు చెబుతున్నాయి.
ఉయ్యాల, గౌరమ్మ, చందమామ పాటలు మళ్లీ గొంతులు సవరించుకుంటున్నాయి. నిన్నటిదాకా ముసలోల్ల నిట్టూర్పులతో బావురుమన్న పెద్ద పెద్ద ఇండ్లు ఇపుడు తిరగడానికి జాగ లేనంతగా ఇరుకు ఇరుకై పోయినయి. అక్కా నువ్వెపుడచ్చినవే.. అంటే చెల్లే నువ్వెపుడచ్చినవే అనే ఆడిబిడ్డల పలకరింపులు పులకరింతలవుతున్న దృశ్యాలు.. పెద్దోళ్ల కళ్లల్లో ఆనంద బాష్పాలై అలుక్కుపోతున్నయి. మూలన పడ్డ నులక మంచాలు, బావుల గిరకలు, కరెంటు లేనప్పుడు విసనకర్రలు బిజీబిజీ అయిపోయినయి. సదువుల్లో… కొలువుల్లో… సంపాదనలో.. ఎక్కడో పోగొట్టుకున్న జీవితాన్ని ఆప్యాయంగా తడిమి తడిమి చూసుకుంటున్న అనుభూతి.
ఇక ఇయాల్ల పగటినుంచి గిన్నెలు, తాంబాళాల్లో కలిపిన రంగుల్లో తెల్ల గునకపూలు రంగులు మారుతుంటే, దోస ఆకుల మీద తీరొక్క పూలు పరుచుకుంటూ కాలం మరిచిన వేళ అగో డప్పులు వస్తున్నయ్ కానియ్యుండ్రి అనే పిలుపులు ఎంత హడావుడి చేస్తయో. బొడ్డెమ్మల దగ్గర ఉయ్యాల పాటల్లో కలిసే కోలలు..దోస్తుల పలకరింపులు.. ఆహ్వానాలు.. మర్యాదలు ఎంత మనసు నింపుతయో. బొడ్డెమ్మ రోజు సిబ్బి మీది సిన్న బతుకమ్మ.. రోజురోజూ పెరిగి పెరిగి సద్దుల బతుకమ్మనాడు పూల పర్వతమై చెరువులో తోటి బతుకమ్మలతో కలిసి ఆడుతుంటే తెచ్చుకున్న సద్దిపిండి తినకముందే నోరు తీపి అయినంత సంబురం. చెరువుకట్ట మీద అమ్మలు, అక్కలు, చెల్లెండ్లు, మరదల్లు, వదినెలు గుంపులు గుంపులు తిరుగుతంటే కడుపు నిండినంత సంబురం. అవును.. తెలంగాణకు కుడుమంటే పండుగే. బతుకమ్మ అంటే బంగారమే. మాది ఉన్నది పంచుకునే సంస్కృతి. లేనిది పెంచుకోవాలనే పేరాశ కాదు.
సకల సౌకర్యాల కల్పనకు సర్కారు ఆదేశం..ఇన్నాళ్లూ పరపాలనలో పాలకులు పట్టించుకోని బతుకమ్మ… పూడిక తీయని చెరువులో మురికినీళ్లలో మగ్గిపోయింది. చెరువుల దగ్గర చదును చేయని ఎగుడుదిగుడుల నేలల మీద సర్కసు ఆటలైంది. చిమ్మ చీకట్ల మధ్య గుబులు గుబులుగా చిన్నబోయింది. ఇవాళ స్వరాష్ట్రంలో బతుకమ్మ పూర్వవైభవం సంతరించుకుంటున్నది. ఇక తేటతేరిన చెరువు నీటిలో బతుకమ్మలు జలకాలాటలాడనున్నాయి. చెరువుల దగ్గర చదును చేసిన స్థలాల్లో కేరింతలు కొట్టనున్నాయి. మంచినీటి వసతి, విద్యుత్ కాంతుల వెలుగుల్లో కోలల కోలాటంలో దేదీప్యమానంగా వెలిగిపోనునున్నాయి.
ఇపుడు బతుకమ్మ మన రాష్ట్రపండుగ. ఏర్పాట్లన్నీ సర్కారువే. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఘనంగా పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. అన్ని ఊళ్లలో బతుకమ్మ ఆటలాడే దేవాలయాలు, చెరువులు, కూడళ్ల వద్ద సకల సౌకర్యాలు కల్పించాలని , పండుగలో పాల్గొనే ఆడబిడ్డలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి తెలంగాణ ఆడబిడ్డ పండుగ చైతన్యాన్ని చాటి చెప్పాలని ముఖ్యమంత్రి అందరినీ ఉత్సాహ పరుస్తున్నారు. ఉద్యోగినులు బతుకమ్మ ఆటలు ఆడుకునేందుకు పనివేళల్లో ఆయన మార్పులు కూడా చేశారు. హైదరాబాద్ సహా పలు నగరాల్లో బతుకమ్మ నమూనాలు ఏర్పాటు చేశారు. పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర భాషా, సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతికశాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, సాంస్కృతికశాఖ డైరెక్టర్ కవితాప్రసాద్ పండుగ ఏర్పాట్లును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ 2న టాంక్‌బండ్‌పై సద్దులబతుకమ్మ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. మన పండుగ గొప్పతనం దేశమంతా చాటేందుకు జాతీయ మహిళా నాయకురాళ్లను ఆహ్వానిస్తున్నారు. ఎల్‌బీ స్టేడియంనుంచి వేలాది బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ దాకా డప్పుల చప్పుళ్లు, కళా బృందాలతో ర్యాలీ జరుపుతున్నారు. టీఎన్జీవో, టీజీవో, ఉద్యోగుల ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యోగుల సంఘం, సెక్రటేరియట్ మహిళా విభాగం తదితర ఉద్యోగ సంఘాల సారథ్యంలో బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరిపేందుకు సన్నాహాలను పూర్తి చేశారు.
మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ. కవిత ఈ పండుగలో భాగం పంచుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున రాష్ట్రమంతా పర్యటించి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా ఆరుదశాబ్దాలలో ఏనాడు జరుగనంత ఘనంగా బతుకమ్మ పండుగ జరుగబోతున్నది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..