mt_logo

బతుకమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ మహిళా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ పండుగ పోస్టర్‌ను సోమవారం సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుందన్నారు. బతుకమ్మ ఆటకోసం మహిళా ఉద్యోగులకు పనివేళలలో వెసులుబాటు ఇచ్చిందని గుర్తు చేశారు. పోస్టర్ ఆవిష్కరణలో టీజీఓ అధ్యక్షురాలు వీ మమత, కార్యవర్గ సభ్యురాలు నవీన్‌జ్యోతి, నాయకులు ఎంబీ కృష్ణయాదవ్, ఎస్ సహదేవ్, జీ నర్సింహులు, రాజ్‌కుమార్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

విస్తృత ఏర్పాట్లు..
సచివాలయంలో బతుకమ్మ పండుగ వేడుకల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని సచివాలయ మహిళా ఉద్యోగ సంఘాల నేతలు నేతి మంగమ్మ, ఉమ మీడియాకు చెప్పారు. ఉద్యోగినులు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ నిర్వహణపై సోమవారం సచివాలయంలో మహిళా ఉద్యోగులతో సమావేశం తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. 24, 27, 30 తేదీల్లో బతుకమ్మలతో సందడి చేస్తామని, రెండో తేదీన ర్యాలీగా బయలుదేరి ట్యాంక్‌బండ్ పై జరిగే వేడుకల్లో పాల్గొంటామని చెప్పారు. సమావేశంలో సుజాత, నీరజ, మహాలక్ష్మి, సుధ, శ్రీలక్ష్మి కూడా పాల్గొన్నారు.

బతుకమ్మ విశిష్టతపై వీడియో చిత్రం
-పదినిమిషాల నిడివితో రూపొందిస్తున్న నేషనల్ గ్రీన్ కాప్స్
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక ప్రతిబింబం బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అత్యంత వైభవంగా జరుగనున్న ఈ పండుగపై నేషనల్ గ్రీన్ కాప్స్ సంస్థ వీడియో ఫిలింను రూపొందిస్తున్నది. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలుపడంతోపాటు బతుకమ్మ పేర్చడానికి ఉపయోగించే పూలు, పండ్లు.. వాటి ప్రత్యేకత ఏమిటనే విషయాలు చాటుతూ పది నిమిషాల నిడివిగల ఈ చిత్రం రూపొందనుంది.

గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, చామంతి, గుమ్మడి, మందార, బంతి, దానస, కనకాంబరాలు, నేలగులాబీ, లిల్లీ, గన్నేరు, చుక్కమల్లె, చిట్టిచామంతి, చల్లగుత్తి, నందివర్థనం, కట్టపూలు, రుద్రాక్ష, చంద్రకాంత, కాశిరత్నం, గడ్డిపూలను బతకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారని ఈ వీడియోలో వివరించనున్నారు. తెలంగాణ ప్రకృతి మిత్ర, తెలంగాణ నేషనల్ గ్రీన్‌కాప్స్ ఈ చిత్రాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *