mt_logo

‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకోసం ‘నేతన్న బీమా’ పథకానికి ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతు బీమా పద్ధతిలోనే నేతన్న బీమా పథకం కూడా కార్మికులకు ధీమా ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని 80 వేలకు పైగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు భరోసా లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ ద్వారా అమలుచేస్తున్నామని వెల్లడించారు. కార్మికుల వంతు ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చేనేత కార్మికుడు మరణించినా, సహజమరణం పొందినా రూ.5 లక్షల పరిహారం అందుతుందని చెప్పారు. కార్మికుడు మరణించిన పది రోజుల్లోనే కుటుంబీకుల ఖాతాలో నగదు జమ అవుతుందని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7న నేతన్న బీమా సౌకర్యాన్ని వర్తింపజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. చేనేత ప్రతినిధిగా, మంత్రిగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఇదేనన్నారు. హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌, ఎల్‌ఐసీ ప్రతినిధి శివ నాగప్రసాద్‌ నేతన్న బీమా పథకానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకొన్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రీమియంగా రూ.50 కోట్ల విలువైన చెక్కును ఎల్‌ఐసీ ప్రతినిధులకు అందజేశారు.

తెలంగాణ చేనేతలు భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని, భారతీయ కళలకు వైభవాన్ని తెచ్చిన కళాఖండాలని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. పోచంపల్లి ఇక్కత్‌, గద్వాల కాటన్‌, సిల్క్‌, సికో జరీ చీరలు, నారాయణపేట కాటన్‌, వరంగల్‌ డర్రీలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, దుబ్బాక నేతలు, జరీచీరలు, కాటన్‌ డిజైన్లు తెలంగాణ చేనేత నైపుణ్యానికి ప్రతీకలని కేటీఆర్‌ ఈ సందర్భంగా కొనియాడారు. అంతరించే దశలో గల పీతాంబరి, హిమ్రూ చేనేత, తేలియా రుమాల్‌ వంటి వాటిని పునరుద్ధరించామన్నారు. ఆర్మూర్‌ పట్టు, గొల్లభామ చీరలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామన్నారు. దేశం గర్వించదగ్గ వస్త్రాలు తెలంగాణలో ఉ్పత్పత్తి అవుతున్నాయన్న మంత్రి.. 10 రోజులపాటు జాతీయ ఎగ్జిబిషన్‌ హైదరాబాద్‌లో కొనసాగుతుందని, తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు మన చేనేత నైపుణ్యాన్ని గుర్తించి, ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించాలన్న తన పిలుపునకు అద్భుతమైన స్పందన వస్త్తున్నదని, రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. అందమైన.. సౌకర్యమైన.. పురాతనమైన చరిత్ర కలిగిన చేనేత దుస్తులను ధరించడంతో ఆరోగ్యపరమైన జీవనశైలి అలవాటవుతుందని, ప్రకృతితో మమేకం కావొచ్చని తెలిపారు. సహజ రంగులు, పోగులతో తయారుచేసిన చేనేత వస్ర్తాలను అంతా ఆదరించాలని పిలుపునిచ్చారు.
చేనేత రిసెర్చ్‌, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి కేటీఆర్‌.. టెస్కో ద్వారా రామప్ప చేనేత చీరలను వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ చేనేత మణిహారంలో మరో రత్నాన్ని చేర్చామని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కిన ఈ తరుణంలోనే రామప్ప చేనేత చీరలను అద్భుత కళాఖండాలతో ఆవిష్కరించడం శుభపరిణామమని కొనియాడారు. తెలంగాణ టెక్స్‌టైల్‌ పాలసీ, హ్యాండ్లూమ్‌ పాలసీలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు మన రాష్ర్టాన్ని అధ్యయనం చేయడం గర్వకారణమని వివరించారు. చేనేత మిత్ర, 50% సబ్సిడీ.. నేతన్నకు చేయూత, త్రిఫ్ట్‌ పథకం ద్వారా వస్ర్తోత్పత్తికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. చేనేత కార్మికుల రుణమాఫీ, వ్యక్తిగత రుణమాఫీ పథకంతో 10 వేలకు పైగా కార్మికులకు చెందిన రూ.29 కోట్ల రుణాలను మాఫీచేశామన్నారు.

ఫ్యాషన్‌ షోలను నిర్వహించి చేనేత వస్త్రాలను ప్రభుత్వం ప్రొత్సహిస్తున్నదని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు 131 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారాలను అందజేశామని పేర్కొన్నారు. అన్నదాతల వలే.. నేతన్నలు దేశానికి వస్త్రదాతలుగా సమాజహితం కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ ఎల్‌ రమణ పేర్కొన్నారు. నిర్జీవంగా ఉన్న చేనేతను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సజీవంగా మలిచారన్నారు. అంతకు ముందు చేనేత ఎగ్జిబిషన్‌ను ఎల్‌ రమణ, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి ప్రారంభించారు. చేనేత మిత్ర, పావలావడ్డీ, నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆ తర్వాత కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులను 28 మంది చేనేత కార్మికులు, వృత్తి నిపుణులకు అందజేశారు. హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ సెక్రటరీ, కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సాంబారి సమ్మారావు, బోల్ల శివశంకర్‌, కర్నాటి విద్యాసాగర్‌, యాదగిరి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌, చింతకింది మల్లేశం, ఎర్రమాద వెంకన్న నేత, సహా పలుసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌ చేనేత చాలెంజ్‌.. స్వీకరించిన పవన్‌కల్యాణ్‌

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మెగాస్టార్‌ చిరంజీవి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మై హ్యాండ్‌లూమ్‌ మై ప్రైడ్‌ పేరుతో చేసిన చాలెంజ్‌ను మంత్రి కేటీఆర్‌ స్వీకరించారు. ఇప్పటికే ప్రతి వారం చేనేత వస్త్రాలు ధరిస్తూ.. చురుకుగా ప్రచారం చేస్తున్నా అని ట్వీట్‌ చేశారు. అనంతరం ఆనంద్‌ మహీంద్ర, క్రికెటర్‌ సచిన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆయన చాలెంజ్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయాలని పిలుపునిచ్చారు. చేనేత వస్ర్తాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు. దీనిపై స్పందించిన పవన్‌కల్యాణ్‌ తాను చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్వీట్‌చేశారు. చేనేతలపై ప్రేమతో తాను రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌) చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *