స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి, జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం 75 మంది వీణ కళాకారుల వీణా వాయిద్య ప్రదర్శనను సీఎం కేసీఆర్ వీక్షించారు. ఆ తర్వాత సాండ్ ఆర్ట్ ప్రదర్శన, దేశభక్తి ప్రబోధ నృత్యరూపకం, ప్యూజన్ ప్రదర్శన, లేజర్ షో జరుగనున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని ఇవ్వనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హెచ్‌ఐసీసీకి తరలివచ్చారు. కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి పక్షం రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.