నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం కరీంనగర్ జిల్లా మంథనిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను. పౌరుషం ఎక్కువే. అవమానం జరిగిన చోటే ఆదరణ కావాలనుకున్నా. మంథని ప్రజలు ఎంతటి నిర్బంధంలో ఉన్నారో తెలిసింది. అందుకే వెతికా. ప్రజాదరణ ఉన్న నాయకుడు పుట్ట మధును గుర్తించా. ఇప్పుడు బుల్లెట్ దిగిందా? లేదా? అని ప్రశ్నిస్తూ అశేష జనాన్ని కేరింతల్లో ముంచారు.
అధికారం శాశ్వతం కాదని, ప్రజాసేవ శాశ్వతంగా నిలిచి ఉంటుందని కవిత అన్నారు. రెండేళ్ళ కిందట మంథని నియోజకవర్గంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన కొమురం భీం విగ్రహాన్ని నెలకొల్పడానికి భీం మనవడు సోనేరావుతో కలిసి వస్తే అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీను బాబు పోలీస్ స్టేషన్ లో పెట్టించారని, కొమురం భీం విగ్రహాలను, ఆయన మనవడిని ఐదు గంటలపాటు పోలీస్ స్టేషన్ లో పెట్టడం తీవ్రంగా బాధించిందని చెప్పారు.
ఈ ప్రాంత బిడ్డలను దారుణంగా హింసించిన పాపం ఊరికే పోదని, పౌరుషం ఉన్న బిడ్డను కాబట్టే ఈ ప్రాంత ప్రజలు ఎంతటి అణచివేతకు గురవుతున్నారో తెలుసుకున్నానని, ప్రజాదరణ ఉన్న వ్యక్తినే ఎన్నుకునే అవకాశాన్ని కలిగించానని పేర్కొన్నారు. సింగరేణి బేస్డ్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని, భద్రాచలంలో లాగా మంథని ప్రాంతంలో పేపర్ మిల్లును పెట్టాలని సీఎం ను కోరినట్లు తెలిపారు.