mt_logo

టెస్లాను ఇండియాకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ పై దేశవ్యాప్త హర్షాతిరేకాలు

ప్రపంచంలోనే అత్యుత్తమ కార్ల కంపెనీ అయిన టెస్లాను ఇండియాకు ఆహ్వానించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో పరిశ్రమలు పెట్టడానికి అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయనేందుకు ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ నిదర్శనంగా నిలిస్తే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపెనీలు ప్రారంభించుకొనేందుకు వీలుగా తెలంగాణలో టీఎస్‌ఐపాస్‌ రెడ్‌కార్పెట్‌ పరుస్తున్న విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ రుజువు చేస్తున్నది.

భారత్‌లో తమ ఎలక్ట్రానిక్‌ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఇక్కడి ప్రభుత్వం నుంచి ‘అనేక సవాళ్ల’ను ఎదుర్కొంటున్నామని ఎలాన్‌ మస్క్‌ ఈ నెల 13న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇండియాలో టెస్లాను ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘డిసెంబర్‌ నాటికి మరో మూడు మోడల్స్‌కు ఇండియా వెహికిల్‌ టెస్టింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీల నుంచి అనుమతి లభించింది. కానీ లాంచ్‌ ఎప్పుడు చేస్తామనే విషయంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు’ అని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. టెస్లా ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణలో ప్రారంభించాలని ట్విట్టర్‌ వేదికగా ఆహ్వానించారు. సుస్థిరమైన కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణ చాంపియన్‌ అని తెలిపారు. భారత్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు టెస్లా సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సంస్థతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తితో ఉన్నామని పేర్కొన్నారు. ‘హే ఎలాన్‌, నేను భారత్‌లోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిని. భారత్‌/తెలంగాణలో మీ కేంద్రం ఏర్పాటుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో మీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భారతదేశంలో అగ్రశ్రేణి వ్యాపార గమ్యస్థానం తెలంగాణ. మీరు తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు. గతంలో టెస్లా మోడల్‌ ఎక్స్‌ కారును టెస్ట్‌ డ్రైవ్‌ చేసిన ఫొటోలను కేటీఆర్‌ ఈ సందర్భంగా రీట్వీట్‌ చేశారు. ‘బాగా ప్రచారంలో ఉన్న టెస్లా మోడల్‌ ఎక్స్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేశా. ఒక మంచి మార్పు కోసం కృషి చేస్తున్న ఎలాన్‌మస్క్‌కు ధన్యవాలు. టేక్‌ ఏ బౌ’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మహారాష్ట్ర, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టాలు కూడా తమ వద్ద టెస్లా కంపెనీని నెలకొల్పాలని ఎలాన్‌ మస్క్‌ను ఆహ్వానించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *