mt_logo

తెలంగాణ సాధనకు…సైనికులై కదలాలి

ఫొటో: తెలంగాణ భరోసా యాత్రలో పాల్గొన్న నాగం జనార్ధన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, బండారు దత్తాత్రేయ. హాజరైన జనసందోహంలో ఒక భాగం. 

తెలంగాణ రాష్ట్ర సాధనకు సైనికులై కదలి ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణవాదాన్ని నిలబెడదామని సోమవారం అచ్చంపేటలో జరిగిన తెలంగాణ భరోసా యాత్రలో తెలంగాణ ఉద్యమ వీరులు పిలుపునిచ్చారు. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ భరోసా యాత్రను సోమవారం ఉదయం అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రారంభించారు. పూజల అనంతరం అక్కడి నుంచి అచ్చంపేటకు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.

కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ పాదయాత్రలు చేపడుతున్నారని, తెలంగాణపై దండయాత్రలు చేస్తూ అధికారం కోసం పాకులాడుతున్నారని కోదండరాం, దత్తాత్రేయ, ఇతర టీజేఏసీ నేతలు విమర్శించారు. తెలంగాణ ద్రోహులు చేస్తున్న పాదయాత్రలు అధికారం కోసమైతే నాగం చేపట్టిన భరోసాయాత్ర విద్యార్థుల్లో, తెలంగాణవాదుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకన్నారు. పాలమూరు జిల్లా ఎంతో అందమైందని, కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా ఆంధ్రవలస పాలకుల నిర్లక్ష వైఖరి వల్ల జిల్లాలోని భూములు బీళ్లుగా మారాయన్నారు. నాగం యాత్రకు తెలంగాణ పది జిల్లాలో తెలంగాణవాదులు అక్కున చేర్చుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆత్మబలిదానాలు వద్దు, గిరిగీసి బరిలో దిగి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో ముందుండి పొరాడి ఎడున్నర నెలలపాటు జైలు జీవితం గడిపానని నాగం పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభను జరుగనివ్వలేదని నాగం గుర్తుచేశారు. అప్పటి ఉద్యమంలో తన సహచరులను కోల్పోయానని, ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు, యువకులను కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని నాగం ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుతో ఉండలేక 30 ఏళ్ల పాటు పనిచేసిన పార్టీని వదిలివేశానన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే రాములు పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. నాగం చేపట్టిన భరోసాయాత్రను తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తారని దత్తాత్రేయ అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఆత్మహత్యలు వద్దని చెప్పడం తెలంగాణ భరోసా యాత్ర ఎంతో అవసరమన్నారు.

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *