By: కట్టా శేఖర్ రెడ్డి
ఈ సంవత్సరం చూడండి. నదీ జలాలకు సంబంధించి ఒక్క ఫిర్యాదూ లేదు. ఏ ప్రాంతం వాళ్లూ మరో ప్రాంతం వాళ్లపై విమర్శలు చేయలేదు. ఎందుకంటే నదుల్లో ఈ సారి నీటికి కొరతలేదు. పైగా వందల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. వర్షాలు బాగా కురిసి, కాలం బాగా అయిన సంవత్సరం పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని నీళ్లు తీసుకుపోయినా, సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా ఎన్ని నీరు మళ్లించుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అసలు మాట్లాడిన వారే లేరు. నిత్య సంఘర్షణలు జరిగే రాజోలిబండ డైవర్షన్ కాలువ వద్ద కూడా ఈసారి పంచాయితీ లేదు. తెలంగాణ, సీమాంధ్ర విడిపోయినా కాలాలు బాగా అయిన సంవత్సరాల్లో సమస్య ఉండదు.
ఎటొచ్చీ కాలం కాని రోజుల్లోనే గొడవ. అటువంటి గొడవలు సమైక్యాంధ్రలోనూ జరుగుతున్నాయి. రాజోలిబండ కాలువ తూములు మూసేయడమూ, కేసీ కెనాల్‌కు నీరు మళ్లించుకుపోవడమూ జరుగుతూనే ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకెళుతున్నారో మానిటర్ చేసేవారే లేరు. రాజోలిబండ వద్ద బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నిలబడి తూములు పగులగొట్టిస్తారు. పోతిరెడ్డిపాడు గేట్లు ఎస్‌పివైరెడ్డి తీయిస్తాడు. డెల్టాకు నీరివ్వద్దని సాగర్ కుడి ఎడమ కాల్వల రైతులు డిమాండు చేస్తారు. అయినా ఇన్నేళ్లూ ప్రజలు కలిసే ఉన్నారు. రక్తపాతాలు జరుగలేదు. ఇప్పుడు విడిపోయినా జరిగే ఉపద్రవం ఏమీ లేదు.
పైగా ఉమ్మడి ప్రాజెక్టులన్నిటికీ సంయుక్త నిర్వహణా వ్యవస్థలు ఏర్పడతాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఇంజనీర్లు, కేంద్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఈ నిర్వహణా వ్యవస్థల్లో ఉంటారు. విభజన సమయంలో జరిగే ఒప్పందాల ప్రకారం నీళ్లను వదులుతారు. తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు ఇటువంటి సంయుక్త నిర్వహణలోనే ఉన్న విషయం అందరికీ తెలుసు. ఒక్క విషయం మాత్రం స్పష్టం. విభజన సమయంలో కరువు ప్రాంతాలకు నీటివాటాల కేటాయింపు జరగాలి. పోతిరెడ్డిపాడు నీటిని అనంతపురం, కర్నూలు జిల్లాలకు దక్కేట్లు చూడాలి. కడప, నెల్లూరు జిల్లాలు కృష్ణ పరివాహక ప్రాంతాలు కాదు. ప్రథమ ప్రాధాన్యం అనంతపురం, కర్నూలు జిల్లాకు ఇచ్చి, తదుపరి ప్రాధాన్యం కడప జిల్లాకు ఇవ్వాలి. నికరజలాలు, వరదజలాల్లో నిర్దిష్టమైన నీటి కేటాయింపులు చేసుకుంటే ఎటువంటి సంకటమూ ఉండదు.
‘విభజన జరిగితే మాకు నీళ్లు రావు. మా పొలాలు బీళ్లు పడతాయి’ అన్నది పెద్ద అబద్ధం.