నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు తాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. రిటర్నింగ్ అధికారిగా జగన్నాథరావు వ్యవహరించనున్నట్టు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఈ నెల 3 నుంచే అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే.
ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుందని, నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా ఈనెల 15న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.