mt_logo

మృత్యువును కాదు, విజయాన్ని ముద్దాడాలి!

By: కట్టా శేఖర్ రెడ్డి 

మనం గెలుస్తాం! మనం గెలుస్తున్నాం!
మనమే గెలిచి తీరతాం! మనం ఓడిపోవడం లేదు!
సాధన సరిహద్దుల్లో నిలబడ్డాం!
మనమంతా విజయాన్ని ముద్దాడాలి!
సత్యం మనవైపు ఉంది,
అన్ని ప్రజాస్వామిక విలువలూ మనవైపే ఉన్నాయి
ఏకాభిప్రాయం ఎప్పుడో సాధించి ఉన్నాం
తెలంగాణ ఇవ్వడానికి వంద కారణాలున్నాయి
నిరాకరించడానికి ఒక్క కారణం లేదు
మనం ఇప్పటికే గెలిచాం!
నిజమే! నమ్మకం కలగడం లేదు కదూ!
గమ్యం అనేకసార్లు మనకు ఇలా కనిపించి అలా మాయమైంది
లెక్కకుమించి ఎదురుదెబ్బలు తిన్నాం,
డెడ్‌లైన్లు దాటిపోయాయి, క్యాలెండర్లు మారిపోయాయి
ఇచ్చేవాడు మాటిమాటికి నాలిక తిప్పేస్తున్నాడు
శత్రువు వికటాట్టహాసం చేస్తున్నాడు
అయినా విజయం మనవైపే ఉంది
ద్రోహులను రాజకీయంగా చంపే శక్తి మన చేతుల్లోనే ఉంది
నవతెలంగాణ నిర్మాతల్లారా!
తెలంగాణ చరిత్ర అంతా యుద్ధాలే!
మనది వీర తెలంగాణ, పోరు తెలంగాణ
తెగించి నిలబడిందే తప్ప శత్రువుకు లొంగలేదు
ఆత్మహత్య పరాజయాన్ని అంగీకరించడం!
మీరు బతకాలి, బంగారు తెలంగాణ నిర్మించాలి!
మన మంత్రులు వానపాముల్లా వాలిపోవచ్చు
మన ఎమ్మెల్యేలు పైరవీల్లో మునిగితేలవచ్చు
పార్టీలు ప్రయోజనాల వేటలో తరించవచ్చు
నాయకులూ నాటకాలాడవచ్చు
కానీ ఉద్యమం మాత్రం సజీవం
మంటలు కనిపించకపోవచ్చు
తెలంగాణ సమాజం మాత్రం జ్వలిస్తూ ఉంది
అది దగ్ధం చేయాలే తప్ప, దగ్ధం కావద్దు!
బలి తీసుకోవాలే తప్ప, బలికావద్దు!

తెలంగాణ పేరెత్తలేని స్థితి నుంచి తెలంగాణ జపం చేయక తప్పని పరిస్థితిదాకా…ఇదంతా మీ అందరి కృషే! ఇచ్చుడో, తెచ్చుడో, చచ్చుడో తేల్చుకోవాల్సిన పరిస్థితి పార్టీలది, ప్రధానంగా కాంగ్రెస్‌ది. ఒక్క కాంగ్రెసేకాదు తెలంగాణకు అడ్డంపడుతున్నవారిని, తెలంగాణకోసం కొట్లాడనివారిని రాజకీయంగా పాతరవేసే శక్తి ఇవ్వాళ తెలంగాణకు వచ్చింది. రాజకీయంగా మరణించాల్సినవారు అనేక మంది ఉన్నారు, మీరెవ్వరూ మరణించాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏ వాదాలు, ఏ ప్రచారాలు, ఏ అబద్ధాలు తెలంగాణవాదాన్ని మాయచేయలేవు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో ఏం మాయలైనా చేయనీయండి. అవేవీ నిలబడేవి కాదు. అవన్నీ చాలా పాతవాదనలు. ఎప్పుడో వీగిపోయిన మాటలు. ఇవ్వడం ఇవ్వకపోవడం, రాజకీయంగా చావడం….ఇదంతా కాంగ్రెస్ చేతుల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చేతుల్లో ఉంది. మధ్యలో ఉన్నవాళ్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇవ్వాలనుకుంటే మధ్యలో ఉన్నవారిని దారిలో పెట్టడం పెద్ద పనికాదు. సమస్య తేల్చాల్సింది వారిరువురిదే. ఇప్పుడు వారు తప్పించుకోవడానికి కారణాలు ఏమీ లేవు. తెలంగాణపై రాజకీయ ఏకాభిప్రాయం ఇప్పటికే పూర్తయింది. ముప్పైకి పైగా రాజకీయ పక్షాలు చాన్నాళ్ల క్రితమే కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలంగాణ ఇవ్వాలని రాశాయి. ప్రధాన ప్రతిపక్షం బిజెపి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఇప్పటికి వందసార్లు చెప్పింది. శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీతో సహా యూపీఏలోని ప్రధాన రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరాయి. ఇక నిర్ణయించుకోవలసింది కాంగ్రెసే.

కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు 400 మందికి పైగా సభ్యుల మద్దతు లభిస్తుంది. వాస్తవానికి రాష్ల్ర విభజన బిల్లుకు సాధారణ మెజారిటీ చాలు. బోడో లేక గూర్కాలాండ్ తరహా మండలి ఏర్పాటు అన్నది కేవలం సీమాంధ్రుల విష్‌ఫుల్ థింకింగ్ నుంచి ప్రచారంలోకి వచ్చింది. అటువంటి మండలి ఏది ఏర్పాటు చేయాలన్నా రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ సవరణకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మద్దతు లభించాలి. ఎన్‌డిఏ మద్దతు ఇవ్వకుండా ఏ బిల్లుకూ మూడింట రెండొంతుల మద్దతు లభించే అవకాశమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం తప్ప, మరే ఆలోచన చేసినా తెలంగాణ ఇవ్వనట్టే పరిగణించాలి. రాష్ట్ర ఏర్పాటు కాకుండా ఇంకెటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇప్పుడు తెలంగాణ సమాజం అంగీకరించదు. ఈ ప్రాంతంలో రాజకీయంగా లబ్దిపొందాలన్నా రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే శరణ్యం. ఇన్నేళ్ల ఉద్యమం తర్వాత, ఇంత రాజకీయ ప్రస్థానం తర్వాత, ఇన్ని వందల మంది త్యాగాల తర్వాత ఎటువంటి మధ్యే మార్గాలూ ఇప్పుడు కాంగ్రెస్‌ను కాపాడలేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకాభిప్రాయం లేకుండా ఎలా అని కొందరు అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేప్పుడు తమిళుల అంగీకారం అడగలేదు. 1960లలో గుజరాత్‌ను విడదీసేప్పుడు మరాఠీల ఏకాభిప్రాయం అడగలేదు. రాష్ట్రాల విభజన అధికారం పార్లమెంటు చేతిలో పెట్టడం అందుకే. శాసనసభ చేతిలో పెడితే ఏరాష్ట్రంలోనైనా మెజారిటీ ప్రాంతాలు, మైనారిటీ ప్రాంతాలపై దాష్టీకం చెలాయిస్తాయని భావించే రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్ర విభజన లోక్‌సభకు అప్పగించారు. ఏకాభిప్రాయం ఉండాల్సింది లోక్‌సభలో, జాతీయ స్థాయిలో తప్ప, రాష్ట్రంలో కాదు. అయినా తెలంగాణ విషయంలో రాష్ట్రంలో కూడాఏకాభిప్రాయం వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, అంతర్ధానమైన పీఆర్‌పీతో సహా అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించినవే. అందువల్ల ఏకాభిప్రాయం అన్నది ఇక ఇప్పుడు అప్రస్తుతం.

తెలంగాణకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకులు చేస్తున్న వాదనలు పూర్తిగా పనికిమాలినవి. సహకార ఎన్నికల్లో గెలిచాం కాబట్టి తెలంగాణ లేదని ఒకాయన వాదిస్తున్నారు. అది వారి లేకితనం. సహకార ఎన్నికలు ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండడం గతం నుంచీ చూస్తున్నదే. ఇప్పుడూ అదే జరిగింది. పార్టీల ప్రత్యక్ష ప్రమేయం, గుర్తు లేకుండా, విచ్చలవిడి డబ్బు, మద్యం పంపిణీల మద్య జరిగే ఆ ఎన్నికలు తెలంగాణపై తీర్పు ఎలా అవుతాయి? ఇదంతా ఎందుకు? తెలంగాణలో రెండు టీచర్ల నియోజకవర్గాల నుంచి, ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి….మూడు ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలవండి చూద్దాం! తెలంగాణ ఎన్నిసార్లు ఎన్ని పరీక్షలకు నిలబడింది? ఎన్ని ఎన్నికల్లో తన అస్తిత్వకాంక్షను రుజువు చేసుకుంది? అయినా మళ్లీ మళ్లీ అవే కాలం చెల్లిన వాదనలు. అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో అన్ని ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ఇటువంటి వాదనలు చేయడం హాస్యాస్పదం. తెలంగాణపై నిర్ణయం జరుగుతుందనుకుంటున్న ప్రతిసారీ ఇటువంటి వాదనలేవో ముందుకు తేవడం వారికి అలవాటే. అందుకే ప్రతి సందర్భం మనకు తీర్పు సందర్భమే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలనూ తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికల్లో తెలంగాణవాదానికి ప్రతినిధులుగా నిలిచినవారిని గెలిపించుకోవడం మనకు మరో పరీక్ష.

సీమాంధ్ర నాయకత్వం పదేపదే చేసే మరికొన్ని వాదనలు -తెలంగాణ ఇస్తే నక్సలిజం బలపడుతుందని, మత ఘర్షణలు జరుగుతాయని. నక్సలిజం పుట్టి, పెరిగి, నశించింది సమైక్యాంధ్రలోనే. నక్సల్బరి వసంతకాల మేఘ గర్జనలు తొలుత ప్రతిధ్వనించింది శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీల్లోనే. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో వేలాది మంది యువకులను కోల్పోయిందీ సమైక్యాంధ్రలోనే. మత ఘర్షణలను రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంది కూడా సమైక్యాంధ్రలోనే. సీమాంధ్ర నాయకులే. ఈ సమస్యల నుంచి సీమాంధ్ర నాయకత్వమేదో తెలంగాణ ప్రజలను కాపాడుతున్నట్టు పోజు పెట్టడం మరీ విడ్డూరం. మతాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడంలో సీమాంధ్ర కాంగ్రెస్‌కు ఉన్నంత అనుభవం ఎవరికీ లేదు. 1990లో మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపడానికి హైదరాబాద్‌లో మతకల్లోలాలు రేపిన దుర్మార్గులు ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు సీమాంధ్ర నాయకులు చేసే వాదనలన్నీ ఎప్పుడో పూర్వపక్షమైపోయాయి. వాస్తవాలకు వారెప్పుడో దూరమయ్యారు. చివరికిప్పుడు అబద్ధాలకు, రెచ్చగొట్టే దాడులకు దిగుతున్నారు. అదంతా ఆంధ్రాలో ప్రాపకం సంపాదించడంకోసమే. అక్కడ రాజకీయంగా బతికి బట్టకట్టడంకోసమే. సమైక్యవాదిగా ఉండాలనుకునే వారెవరూ లగడపాటి రాజగోపాల్, పరకాల ప్రభాకర్‌లలా మాట్లాడరు. తెలంగాణవాదంపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని ఉన్మాదస్థాయిలో మాట్లాడేవారు తెలంగాణ ప్రజలను తమతో కలసి ఉండాలని ఎలా కోరగలరు? తెలంగాణ బిడ్డలెవరూ వారిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోయేవాడి మానసికస్థితి వారిది.

మనం నిబ్బరంగా నిలబడి కొట్లాడాల్సిన తరుణం ఇది. బేలతనం, నిరాశనిస్పృహలు వద్దు. తెలంగాణ ఉద్యమశక్తులు, రాజకీయ పక్షాలు ఒక సంఘటిత శక్తిగా అంతిమ సమరానికి సిద్ధంకావాలి. మనం ఏకకాలంలో మూడు వైపులా కొట్లాడాల్సిన అవసరం ఉంది. సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తున్న అబద్ధాల ప్రచారయుద్ధాన్ని తిప్పికొట్టడంతోపాటు, కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేయవలసిన అవసరం ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంతో కలసిరాకుండా పదవులవైపు, సీమాంధ్ర పార్టీలవైపు దొంగచూపులు చూస్తున్న ఇంటిదొంగలను రాజకీయంగా వెలివేయవలసిన అవసరమూ ఉంది. ఇది జరగాలంటే- ఇప్పటి నుంచే ఉద్యమ శక్తులన్నీ కత్తుకట్టాలి. ఈ రెండు మాసాలకాలం చాలా కీలకం. అటు కేంద్ర బడ్జెట్, ఇటు రాష్ట్ర బడ్జెట్ ఆమోదింపజేసుకునేదాకా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. మార్చి 25లోపు రెండు బడ్జెట్‌లూ ఆమోదం పొందాలి. ఆ తర్వాతే కేంద్రం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా నిర్ణయం రాకపోతే, కాంగ్రెస్‌ను, తెలంగాణకు ద్రోహం చేసిన సకల రాజకీయ పక్షాలను శంకరగిరి మాన్యాలు పట్టించే ఆఖరు అస్త్రం మనవద్దే ఉంటుంది. ఎప్పటికైనా మనమే గెలిచి తీరతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *