mt_logo

హెరిటేజ్ అని రోగులను చంపుకుంటామా?- సీఎం కేసీఆర్

ఉస్మానియా ఆస్పత్రి భవనం శిధిల స్థితికి చేరుకొని గదుల్లో పై పెచ్చులు ఊడిపడటంతో డాక్టర్లు, పేషెంట్లు ఆందోళన చెందుతున్నారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం ఉస్మానియా దవాఖానను సందర్శించారు. అక్కడి భవనాలను పరిశీలించిన అనంతరం సీఎం డాక్టర్లు, రోగులతో మాట్లాడారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ 110 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ హాస్పిటల్ బిల్డింగ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, పేషెంట్లు, వైద్యులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని వారంలోగా ఖచ్చితంగా ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లను వివిధ ఆస్పత్రులకు చేరుస్తామని స్పష్టం చేశారు. ఈ భవనం నిలవదని జేఎన్టీయూ ఇంజినీర్లు కూడా చెప్పారని, అందుకే దీన్ని తొలగించి ఇదే స్థానంలో ఆధునిక పద్ధతిలో భవనాన్ని నిర్మిస్తామన్నారు.

ఎప్పుడో 110 ఏళ్ల క్రితం కట్టిన దవాఖాన ఇది.. అసలు ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని ఒక భయానక స్థితి నెలకొని ఉన్నది. అనేక సందర్భాల్లో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లలో పెచ్చులూడటం, డాక్టర్ల తలలు పగలడం, పేషెంట్లపై పడటం జరిగాయని, వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రమాదం చోటుచేసుకుని వందలమంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి తనకు చెప్పారని అన్నారు. ఎంత రిపేర్ చేసినా, ఏం చేసినా మూడు, నాలుగు సంవత్సరాల కంటే నిలవదని ఇంజినీరింగ్ ఎక్స్ పర్ట్స్ చెప్పడం జరిగింది.. ఎట్టి పరిస్థితుల్లో వారంలో ఉస్మానియా హాస్పిటల్ ను షిఫ్ట్ చేయడం జరుగుతుందని సీఎం తేల్చిచెప్పారు.

హెరిటేజ్ అని, చారిత్రక కట్టడం అని చెప్పి వందల ప్రాణాలను బలి పెట్టలేమని, హెరిటేజ్ చట్టంతో కొన్ని ఇబ్బందులున్నాయని, ఆ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రాష్ట్ర గవర్నర్ ను, చీఫ్ జస్టిస్ ను కలిసి దవాఖాన పరిస్థితి చూడమని స్వయంగా తాను కోరుతానని, ఈ భవనం చూసినవారు ఎవరూ దీన్ని కొనసాగించాలని చెప్పరని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పది జిల్లాలతో పాటు మహారాష్ట్ర, గుల్బర్గా నుండి కూడా దశాబ్దాల నుండి ప్రజలు వైద్యం కోసం ఉస్మానియాకు వస్తున్నారు. అందుకే భవిష్యత్తులో కూడా ఈ ఆస్పత్రి ఇక్కడే ఉండాలి. దీన్ని తరలించడం వల్ల మెడికల్ కాలేజ్, సీట్లు ఇబ్బందులు అంటున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, హెల్త్ మినిస్టర్ ఢిల్లీ వెళ్లి ఎంసీఐ అధికారులతో చర్చిస్తారని సీఎం చెప్పారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆస్పత్రిని సందర్శించిన వారిలో వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ సలీం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆరోగ్య శాఖ కార్యదర్శి సురేశ్ చందా, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘురాం తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *