తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తూనే ఉందని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఈరోజు ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కేంద్రం ఇంకా వివక్ష ప్రదర్శించడం మానుకోలేదని, ఏపీకి ఐఐటీ తో పాటు 17 జాతీయ సంస్థలను కేటాయించిన కేంద్రం తెలంగాణకు ఉత్త చేతులు చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు పథకాల్లో కూడా వివక్ష చూపిస్తుందని, కాంగ్రెస్ బాటలోనే బీజేపీ కూడా నడుస్తోందని అన్నారు.
దేశంలోనే తొలిసారిగా రూ. 5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, ఇదే అంశంపై కేంద్రంతో మాట్లాడి సహకరించాలని సీఎం కోరారని నర్సయ్య గౌడ్ గుర్తుచేశారు. కానీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, కేవలం పదివేల ఇళ్ళు తెలంగాణకు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా సరే కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని, బీజేపీ రాజకీయ పార్టీగా ఎదగాలంటే ప్రజలను ఆకట్టుకోవాలని, అప్పుడే బీజేపీ పార్టీకి గుర్తింపు వస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్ళు చల్లితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు.