mt_logo

జైపాల్ రెడ్డి రాత్రికి రాత్రే తెలంగాణ వాది అయ్యారా?- గువ్వల బాలరాజు

కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డిలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధనకోసం కృషి చేశామని అబద్ధాలు చెప్తూనే మరోవైపు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై జైపాల్ రెడ్డి, జానారెడ్డిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. వీరిద్దరూ తమ జీవితంలో ఏనాడైనా తెలంగాణ సమాజానికి అండగా నిలిచారా? అనేక సంవత్సరాల పాటు కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఒక్క ప్రాజెక్టునైనా సాధించారా? 1969 ఉద్యమ సమయంలో పచ్చి సమైక్యవాదినని ప్రకటించుకున్న జైపాల్ రెడ్డి ఇప్పుడు రాత్రికి రాత్రే తెలంగాణ వాది అయ్యారా? 2009 డిసెంబర్ 9 న తెలంగాణ ప్రకటన చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత సీమాంధ్ర బడాబాబుల ఒత్తిళ్లకు తలొగ్గి యూ టర్న్ తీసుకున్నప్పుడు జైపాల్ రెడ్డి, జానారెడ్డిలు నిద్ర పోయారా? అని బాలరాజు ప్రశ్నించారు.

కాంగ్రెస్ చేసిన దొంగ రాజకీయం వల్లే తెలంగాణలో వందలమంది యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన జైపాల్ రెడ్డికి నిఖార్సయిన ఉద్యమకారుడు కేసీఆర్ ను విమర్శించే హక్కు లేదని బాలరాజు స్పష్టం చేశారు. తెలంగాణ పక్షాన నిలవాలని అడిగితే తాను దేశానికి మంత్రినని, తెలంగాణకో, మరో ప్రాంతానికో కాదంటూ తెలంగాణ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేసిన జైపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. మంత్రి పదవి కోసం తెలంగాణ ఫోరం పెట్టి, పదవి రాగానే తెలంగాణను మర్చిపోయిన జానారెడ్డి కూడా కేసీఆర్ ను విమర్శిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అన్నారు.

తెలంగాణకు మద్దతివ్వండని వేడుకోవడానికి వెళ్ళిన విద్యార్థులను అప్పుడు మంత్రులుగా ఉన్న వీళ్ళు తమ అనుచరులు, గన్ మెన్లతో చితకబాదించలేదా? ఉస్మానియా యూనివర్సిటీలో ఆంధ్రా పోలీసులు విద్యార్థులను గదుల్లో బంధించి చిత్రహింసలు పెడ్తున్నారని, ఆడపిల్లలను ఆటవికంగా హింసిస్తున్నారని మొరపెట్టుకున్నా అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉద్యమాన్ని ఎగతాళి చేయలేదా? పాలమూరులో విద్యార్థులు, జేఏసీ నేతలపై డీకే అరుణ గూండాగిరి చేయించలేదా? మంథని నియోజకవర్గంలో కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించకుండా శ్రీధర్ బాబు అడ్డుకోలేదా? యాకూబ్ రెడ్డిని అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎట్లా కొట్టించాడో అందరికీ తెలియదా? ఇప్పుడు నీతులు వల్లిస్తున్న ఈ కాంగ్రెస్ నేతలంతా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను ఎక్కడికక్కడ నిర్భందించి దమనకాండను అమలు చేస్తే మా తెలంగాణ నాయకులను ఎందుకు హింసిస్తున్నారని? వీరిలో ఏ ఒక్కరైనా ప్రశ్నించారా? అని గువ్వల బాలరాజు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *