తెలంగాణ, థాయ్‌లాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై ఒప్పందం కుదిరింది. గురువారం బ్యాంకాక్‌లో తెలంగాణ ఎఫ్‌టీసీసీఐ, థాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. దీంతో పరస్పర వాణిజ్య సహకారం, చిన్న-మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్స్ అభివృద్ధిపై కలిసి పనిచేయనున్నాయి. అలాగే వ్యవసాయ ఆధారిత ఆహారశుద్ధి పరిశ్రమలు, కలప ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. భవిష్యత్తులో ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ, మీట్ ప్రాసెసింగ్, ఫర్నీచర్ పరిశ్రమల్లోనూ పెట్టుబడులు రానున్నాయి. కాగా, తెలంగాణలో నేరుగా లేదా జాయింట్ వెంచర్ల ద్వారా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని థాయ్‌ను ఎఫ్‌టీసీసీఐ కోరింది.
థాయ్‌లాండ్ ప్రభుత్వ పిలుపు మేరకు ఎఫ్‌టీసీసీఐకి చెందిన 30 మంది వాణిజ్య ప్రతినిధుల బృందం ఆ దేశంలో పర్యటిస్తోంది. ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, థాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ ఫైరుష్ బురపచై శ్రీ, ఏవీపీఎస్ చైర్మన్ చక్రవర్తి దీనిపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఒక దేశ వాణిజ్య శాఖ భారత్‌లోని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి.