తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలపై కంపెనీలకు అవగాహన కల్పించేందుకు ఇన్వెస్ట్ – ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తైవాన్ పెట్టుబడులకు ఆది నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటిదాకా తెలంగాణ – తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందన్నారు. తైవాన్ పెట్టుబడుల కోసం గతంలో ఆ దేశంలో పర్యటించామని, తైవాన్ దేశానికి సంబంధించిన టీసీఏతో టెక్నాలజీ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండియన్ తైవాన్ స్టార్టప్ అలయన్స్‌ని ఏర్పాటు చేసుకున్న ఏకైక భారత సిటీగా హైదరాబాద్ ఉందని కేటీఆర్ అన్నారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని, ఈ దిశగా తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ప్రస్తుతం తైవాన్‌కి చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానం :
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని మంత్రి కేటీఆర్ క్లుప్తంగా వివరించారు. ఇప్పటికే రాష్ట్రం సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని, తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం పెరుగుతూ వస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణ ప్రతిసారి అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ వస్తుందన్నారు.
ఈ సందర్బంగా తైవాన్ కు చెందిన టైట్రా (Taiwan External Trade Development Council) చైర్మన్ జేమ్స్ ఎఫ్ హువంగ్ మాట్లాడుతూ.. తెలంగాణ తైవాన్ దేశానికి సహజ భాగస్వామి అని, ఇప్పటికే తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని, రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో ఈ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలంగాణతో పని చేయడం తమకు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్నిస్తుందని ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లా అన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.