mt_logo

మూడవరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇంత భారీ రుణమాఫీ అనేది సాహసోపేతమైన నిర్ణయమని, ఖరీఫ్ లక్ష్యం రూ. 12 వేలకోట్ల రుణాలకు గానూ రూ. 8,100 కోట్లు రుణమాఫీ జరిగిందని తెలిపారు.

అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ, ఈ నెలాఖరుకల్లా రైతులందరికీ రుణాలు అందుతాయని, 36 లక్షల 23 వేలమందికి రుణమాఫీ జరిగిందని, బంగారం తాకట్టు ఉన్న రుణాలు రూ. 1500 కోట్లు ఉన్నాయన్నారు. బ్యాంకులు బంగారంపై 7 శాతం వడ్డీగా ఇచ్చిన రుణాలు మాత్రమే పంట రుణాలుగా పరిగణిస్తారని, 7 శాతం వడ్డీకి బంగారం పెట్టి రుణాలు తీసుకున్న వారికే మాఫీ జరుగుతుందని పోచారం అన్నారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతులకు రూ. 8,123 కోట్లు మంజూరు చేశారని, ఆంధ్రా ప్రభుత్వం లాగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేయడం లేదని, ఆంధ్రాలో ఒక్క రైతు కన్నా మాఫీ వర్తించిందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని, మాట తప్పడం తమ విధానం కాదని హరీష్ రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *