mt_logo

టీడీపీ సభ్యులు చెప్పేవన్నీ బాబు మాటలే – కేసీఆర్

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల రుణాలపై వివరణ ఇస్తుండగా టీడీపీ సభ్యులు మధ్యలో అడ్డుతగిలి గందరగోళం సృష్టించారు. దీనిపై మండిపడ్డ సీఎం మాట్లాడుతూ, సభను సంస్కారవంతంగా నడిపించేందుకు సహకరించాలని, సభలో టీడీపీ సభ్యులు చెప్పే మాటలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు మాటలేనని అన్నారు. లోపాలు ఏవైనా ఉంటే సవివరంగా చర్చిద్దాం కానీ సభకు ఆటంకం కలిగించొద్దన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఒక్క హామీ నెరవేర్చకపోగా తెలంగాణను గోల్ మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, క్రిష్ణపట్నం నుండి రావాల్సిన 190 మెగావాట్ల విద్యుత్ ను, సీలేరు, డొంకరాయి నుండి రావలసిన 390 మెగావాట్ల విద్యుత్ ను, మాచ్ ఖండ్, టీవీ డ్యాం నుండి రావాల్సిన మరో 36 మెగావాట్ల విద్యుత్ ను ఏపీ అడ్డుకుంటుందని సీఎం తెలిపారు. హిందూజా నుండి 561 మెగావాట్ల విద్యుత్ పై కూడా తెలంగాణకు అర్హత ఉందని, ఈ ప్రాజెక్టు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టునుండి విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను ఏపీ అడ్డుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, చట్టం ప్రకారం తమకు రావాల్సిన 980 మెగావాట్ల విద్యుత్ వాటా రావాల్సిందేనని సీఎం తేల్చిచెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని, తెలంగాణ పంటలను ఎండగొట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, తెలంగాణ రైతుల పక్షాన ఉండాల్సిందిపోయి చంద్రబాబుకు వత్తాసు పలకడం ఏమిటని టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. సభలో ఏపీ సీఎం పేరు ప్రస్తావించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ ఆందోళన చేయడంతో సభ పదినిమిషాలపాటు వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *