mt_logo

ఆంధ్రోళ్ళకు మోడీ ఏజెంట్!- కేసీఆర్

నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో గురువారం జరిగిన బహిరంగసభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ నేత నరేంద్రమోడీ, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లిని చంపి బిడ్డను బతికించినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని నరేంద్రమోడీ అన్న మాటలను గుర్తుచేస్తూ, ‘ ఏ తల్లి చచ్చింది? ఏ బిడ్డ బతికింది? తెలంగాణ ఇస్తే భరతమాత ఏడ్చిందా? స్వేచ్చావాయువుల్లోకి వచ్చిన తెలంగాణను ముద్దాడి భరతమాత కడుపార నవ్విందని’ అన్నారు. అయినా నీకు సంస్కారం ఉందా? తెలంగాణ ఉద్యమంలో వేలమంది బలయ్యారు. పోరాడి తెలంగాణ సాధించుకుంటే కనీసం శుభాకాంక్షలు చెప్పే విజ్ఞత లేదు. తెలంగాణ గురించి నువ్వా మాట్లాడేది? ఆంధ్రా బాబులను వెంటేసుకుని తిరగడంలోనే నువ్వేంటో తెలంగాణ ప్రజలకు తెలిసింది. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మోడీని హెచ్చరించారు. హైదరాబాద్ లో వేలకోట్లు విలువచేసే భూములను కబ్జా చేసిన సీమాంధ్రులకు మోడీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని, చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానకపోతే తెలంగాణలో తిరిగే పరిస్థితి ఉండదని అన్నారు.

బోధన్ నిజాం షుగర్స్ ను అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, రెండునెలల్లోనే పూర్తిస్థాయిలో ప్రభుత్వపరం చేస్తామని, ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా నిజాం షుగర్స్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దళితుల భూములను కబ్జా చేసిన పొన్నాలపై రెండురోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని, రెండు రోజుల్లో పొన్నాల అరెస్టు కావడం ఖాయమని అన్నారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై డీఎస్ దాడి చేయించారని, భయపెట్టాలని చూస్తే దుమ్ములేపుతామని కేసీఆర్ హెచ్చరించారు.

బీడీ కార్మికులకు ఇప్పుడున్న వేతనాలకు అదనంగా వెయ్యిరూపాయల భ్రుతిని అందజేస్తామని, ఇందూరుకే సింగూరు జలాలని, సింగూరు నీటిలో 3, 4టీఎంసీలను మెదక్ జిల్లాకు కేటాయించి మిగతావి నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడిచిపెడతామని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ లో బాజిరెడ్డి గోవర్ధన్ ను, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని, కామారెడ్డిలో గంప గోవర్ధన్ ను, నిజామాబాద్ జిల్లా ఎంపీగా కవితను గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాను పుట్టిన గడ్డ మెదక్ అని, అన్నిరంగాల్లో ఈ జిల్లాను అభివృద్ధి చేస్తామని, మెదక్ పట్టణ కేంద్రంగా మెదక్ జిల్లానే ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. సింగూరు నీళ్ళకు ఎవరు అడ్డుపడతారో చూస్తానని, నర్సాపూర్ నియోజకవర్గానికి లక్షా 25వేల ఎకరాలకు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మెదక్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *