mt_logo

తెలంగాణ అభివృద్ధిని మోడీ ఓర్వలేకపోతున్నారు : మంత్రి హరీష్ రావు

వరంగల్ జిల్లా, ఎంజీఎం ఆస్పత్రిలో పిల్లల కోవిడ్ ప్రత్యేక వార్డును వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం హన్మకొండలో టీ డ‌యాగ్నోస్టిక్‌, రేడియాల‌జీ ల్యాబ్‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో కరోనా పెరగడానికి మోడీ ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన సభ అయితే దాన్ని వలస కార్మికుల మీదికి నెట్టివేసిన ఘనత ప్రధానిది అన్నారు. ఎర్రని ఎండలో వేల కిలోమీటర్లు కార్మికులు కాలినడక ప్రయాణం చేస్తూ స్వస్థలాలకు చేరుకుంటే వారికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు కల్పించక పోగా… వలస కార్మికుల అవస్థలు చూసి వారికి భోజనం పెట్టి, స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేసిన సీఎం కేసీఆర్ పైనే నిందలు వేస్తున్న మోడీ దిగజారుడు తననానికి నిదర్శనం అన్నారు. ప్రధాని తెలంగాణపై విషం చిమ్మారని, గతంలో కూడా తల్లీకూతుళ్లను విడదీశారు అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల బలిదానాలను మోడీ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు, బలిదానాల అనంతరం సాధించుకున్న తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది? వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? దేశ‌వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీ ఇస్తే తెలంగాణ‌కు ఒక్క‌టి కూడా ఎందుకు కేటాయించ‌లేదు. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

తెలంగాణ అంటే భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌డుపు నిండా విషం ఉంటుంద‌న్నారు. నిధులు ఇవ్వ‌కుండా సూటిపోటి మాట‌లు మాట్లాడ‌టం బీజేపీకి స‌రికాద‌న్నారు మంత్రి హరీశ్. బీజేపీ ఎన్ని కుట్ర‌లు చేసినా రాష్ట్రం అభివృద్ధి వైపే అడుగులు వేస్తుందని.. పురోగ‌తిలో వెనక్కి తగ్గేదే లేదని మంత్రి తేల్చి చెప్పారు. ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో టాప్ 10లో దేశంలో 7 తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. వివిధ రంగాల్లో కేంద్రం నుండి అనేక అవార్డులు వ‌చ్చాయి. ఇది మా పని తీరుకు నిదర్శనం. కేంద్రానికి, బీజేపీకి క‌ళ్ల‌కు క‌నిపిస్త‌లేదా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పార్టీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్ ,ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్ ఇతర స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *