mt_logo

మార్చి 12న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ స్థానాలను తిరిగి భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రాహుల్ శర్మ షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 12కు పోలింగ్ జరగనున్నది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. 15వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు రాహుల్ శర్మ తెలిపారు. పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలలో మహమూద్ అలీ(టీఆర్ఎస్), మహ్మద్ సలీం(టీఆర్ఎస్), టీ. సంతోష్ కుమార్(టీఆర్ఎస్), షబ్బీర్ అలీ(కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్ రెడ్డి(కాంగ్రెస్) ఉన్నారు.

ఖాళీ అయ్యే ఐదు స్థానాలనూ గెలుచుకునే అవకాశం టీఆర్ఎస్ పార్టీకే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా ఈ కోటాలో టీఆర్ఎస్ మొత్తం స్థానాలు కైవసం చేసుకోనున్నది. రాష్ట్రంలో మొత్తం 119 మంది శాసనసభ్యులు ఎమ్మెల్యే కోటా కింద కొత్తగా ఎమ్మెల్సీలను ఓటు ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే ఐదుకు ఐదు సీట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుంది.

ఇదిలాఉంటే శాసనమండలిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ ను కలిసి తమను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా కోరారు. వారి వినతిని అంగీకరించిన మండలి చైర్మన్ వారిని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సభ్యుల సంఖ్య లేకుండా పోయింది. మరోవైపు మండలిలో కాంగ్రెస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పదవీకాలం వచ్చేనెల 29తో ముగియనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మండలిలో అడుగుపెట్టే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *