సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ఇపుడు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రంగాల్లో అనేక అవార్డులు తెలంగాణకు రాగా.. తాజాగా ఆ జాబితాలోకి మిషన్ భగీరథ చేరింది. ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధజలాలను అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర జల్ జీవన్ మిషన్ పురస్కారం లభించింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇండ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు జాతీయ జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్.. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు బుధవారం లేఖ రాశారు.
దేశంలోనే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రశంసించారు. నల్లా నీటిని అందించడంలో ఆదర్శమైన పనితీరును కనపర్చిందని పేర్కొన్నారు. అవార్డు అందించడం ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవనానికి నీటి సరఫరా ఎంతో తోడ్పడుతుందని ఆశిస్త్తున్నట్టు వెల్లడించారు. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఇప్పటికే రాష్ట్రానికి 13 అవార్డులొచ్చాయి. ఈ అవార్డులు అందుకోవడానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనున్నది.
మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అవార్డును ప్రకటించిన కేంద్రాకి, జల్‌జీవన్ మిషన్‌కు ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లోని ప్రతి ఆవాసానికీ రక్షిత తాగునీరు అందుతున్నదని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడింది. ఈ పథకం అమలుతీరును ఇటీవల జల్ జీవన్ మిషన్ స్వయంగా పరిశీలించిందని, 320 గ్రామాల్లో స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించిందని, నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలించడమేగాక, ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిందని గుర్తుచేసింది.
ఈసందర్భంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…ఈ అవార్డు ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథలో కృషిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తూ… ఇలాంటి అవార్డులు మా బాధ్యతను మరింత పెంచుతాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేశారు.