తెలంగాణలో మిరప రైతులకు కనక వర్షం కురుస్తోంది. గత కొద్దిరోజులుగా మిర్చి ధర పైపైకి ఎగబాకుతూ బంగారంతో పోటీ పడుతోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. దేశీయ మిర్చి క్వింటాల్ ధర రూ. 52 వేలు పలుకుతున్నది. కొద్ది రోజుల క్రితం ఈ మార్కెట్లో దేశీ రకం మిర్చి క్వింటాల్ ధర రూ. 48 వేలు ఉండగా… ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది. ములుగు మండలం ఎస్ నగర్ గ్రామానికి చెందిన రైతు బల్గూరి రాజేశ్వరరావు 7 బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. దీనికి మార్కెట్‌లోని లాల్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారులు ధర రూ. 52 వేలు నిర్ణయించారు. ఇప్పటివరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, మిర్చికి భారీ ధర పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

