మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీని ప్రపంచ దేశాలు గౌరవించాయి. కానీ దేశంలో మాత్రం పీవీకి సరైన గౌరవం దక్కలేదని తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉంది. అందుకే ఈనాటి తరానికి పీవీ సంస్కరణలు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడం సంతోషించదగ్గ పరిణామమని చెప్పారు. పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో స్మృతి వనం ఏర్పాటు చేసి దానికి పీవీ పేరు పెడతామని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రి గంగుల కమలాకర్ బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీవీతో తనకు చాలా అనుబంధం ఉందని, 1984 లో పీవీ ఎంపీగా ఉన్నారని, తనకు ఇంజినీరింగ్ సీటు ఇవ్వాలని ఒక ఇంజినీరింగ్ కాలేజీకి చీటీ మీద రాసి ఇచ్చారని చెప్పారు. అయితే డబ్బులు కట్టాలని కాలేజీ వారు చెప్పడంతో తాను మళ్ళీ పీవీ వద్దకు వెళితే ఆయన ఒక మాట ఆన్నారు.. వెనుకబడిన కులాల బిడ్డలు డబ్బులు కట్టలేరని పీవీ అన్నారని కమలాకర్ గుర్తుచేశారు. ఒక్క రూపాయి కూడా డబ్బు లేకుండా సీటు ఇప్పించారని, అలా పీవీ వల్ల తన ఇంజినీరింగ్ విద్య పూర్తయిందని, పీవీ ప్రధాని అయ్యాక ఆయనను కలిశానని చెప్పారు. సాగునీటి రంగంలో పీవీ కన్న కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు. కరీంనగర్-వరంగల్ హైవే కి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ కు మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పీవీ ఏ అన్యాయాన్ని సహించలేదని, పట్వారీ వ్యవస్థ నుండి ప్రధాని వరకు అనేక సంస్కరణలు తెచ్చి దేశానికే వన్నె తెచ్చారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంత్యుత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో పీవీకి గుర్తింపు రావడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. పీవీ పుట్టిన, పెరిగిన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి వివరించారు.