అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు ప్రారంభం అయ్యాయి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సువిశాల భారదేశంలో 135 కోట్ల జనాభా ఉంది. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఈ పదవి అరుదుగా దక్కుతుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడ్తున్నాం అని చెప్పారు.
భారతదేశం అతివేగంగా అభివృద్ధి చెందడానికి, ఆర్ధిక వ్యవస్థలో పురోగమించడానికి పీవీ కారణం. పీవీ మన ఠీవీ అని తెలంగాణ సమాజం సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది. పీవీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. దేశ ఆర్ధిక రంగాన్ని పీవీ ప్రగతి రథంలో పరుగులు పెట్టించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పదవి చేపట్టిన మొట్టమొదటి దక్షిణాది వ్యక్తి పీవీ. నూతన ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వాటిని సమర్ధవంతంగా అమలు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని ఆర్ధికవేత్త మన్మోహన్ ను ఆర్ధిక శాఖామంత్రిగా నియమించి పీవీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుండి దేశ ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు తీయించారు. ప్రపంచం నలుమూలలనుండి దేశానికి పెట్టుబడులు వస్తున్నాయంటే కారణం పీవీనే..
గ్లోబల్ ఇండియా రూపశిల్పి పీవీ. పీవీ ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేసిన ఘనత పీవీదే. భూ సంస్కరణలు చిత్తశుద్ధితో అమలు చేశారు. రాష్ట్ర విద్యా శాఖామంత్రిగా గురుకులాలు ప్రారంభించారు. కేంద్రంలో మానవవనరుల శాఖా మంత్రిగా నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. తెలుగు అకాడెమీని నెలకొల్పిన ఘనత కూడా పీవీకే దక్కుతుంది. అఖండ పాండిత్యం ఉన్న వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం సమున్నతమైంది. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వేయిపడగలు అనే నవలను హిందీ భాషలోకి అనువాదం చేశారు. ఈ నవల ఇతిహాసం వలె ఉంటుంది. పీవీ దేశానికి, రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారరత్న ఇవ్వాలని శాసనసభా ముఖంగా కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.