ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవ్వనున్న బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు మొహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైద్రాబాద్ సీపీ సివి ఆనంద్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యాధునిక టెక్నాలజీతో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేశామని, ఈ నిర్మాణం దేశానికే మణిహారం అవుతుందని మంత్రి అన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీని కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణంలో వినియోగించినట్లు వివరించారు. హోమ్ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ పనులు దాదాపు పూర్తి అవుతున్నాయని, ఆగస్టు 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని… రాబోయే రోజుల్లో నగర వాసుల భద్రత మరింత పెరగనుందని, ప్రతి ఒక్క ప్రాంతం కమాండ్ కంట్రోల్ అండర్ లో ఉంటుందని మహమూద్ అలీ తెలియజేశారు.