mt_logo

అగ్గిపెట్టెలో ఇమిడే చీర నేసిన నేత కార్మికున్ని ప్రశంసించిన మంత్రులు

అగ్గిపెట్టెలో పట్టే నేత చీరను తయారు చేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతకారుడు నల్ల విజయ్ ని మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర చేనేత-జౌళి శాఖ మంత్రి కేటీఆర్ తో సహా పలువురు మంత్రులు అభినందించారు. అద్భుతమైన నేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ… విజయ్ నేసిన అద్భుతమైన చీరకు సంబంధించిన నేత ప్రక్రియను, ఇతర వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామని… దాన్ని నేసిన విజయ్ ని ప్రత్యేకంగా అభినందించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అనంతరం ఆ చీరను ప్రదర్శించిన విజయ్ దానిని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందించారు. మంత్రి కేటీఆర్ విజయ్ ని ప్రశంసిస్తూ… ప్రభుత్వ కార్యక్రమాలతో సిరిసిల్లలోని నేత రంగంలో ఇప్పటికే అనేక మార్పులు తెరాస ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. సిరిసిల్ల నేతన్నలు ఆధునికమైన మరమగ్గాల వైపు, ఆధునిక పద్దతుల వైపు వెళ్తున్నారని విజయ్ మంత్రులకు తెలిపారు. ప్రస్తుతం తాను నేసిన చీర ఆధునిక మరమగ్గాలపై చేసిందేనని, దీనిని చేతితో వేయాలంటే రెండు వారాల సమయం పడుతుందని అన్నారు. నేత కార్మికుని ప్రయత్నాన్ని అభినందించిన మంత్రులు… విజయ్ చేసే భవిష్యత్తు ప్రయత్నాలకు తాము సంపూర్ణం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే తాను ప్రారంభించబోయే యూనిట్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ను విజయ్ ఆహ్వానించగా, ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పక వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విజయ్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *