ఆలయ కమిటీలు వెంటనే దరఖాస్తు చేసుకోండి : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • July 4, 2022 10:38 pm

బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స్య మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ లతో కలిసి దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్, 24 వ తేదీన జరిగే హైదరాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ ఏడాది కూడా బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిన క్రమంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిధులను ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. 25వ తేదీన జరిగే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు సందర్భంగా 500 మంది కళాకారులతో చార్మినార్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన వివరాలను వెల్లడించారు. అదేవిధంగా పాతబస్తీ లోని దమయంతి బిల్డింగ్, ఢిల్లీ దర్వాజ, గోల్కొండ, రవీంద్రభారతి, ఇందిరాపార్క్ వద్ద గల కట్టమైసమ్మ ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, చిలకలగూడ తదితర 8 ప్రాంతాలలో త్రీ డీ మ్యాప్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ అమయ్ కుమార్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఐఅండ్‌ పీఆర్‌వో సీఐఈవో రాధాకృష్ణ, డీఆర్‌వో సూర్యలత, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణ, ఏసీలు బాలాజీ, కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE