mt_logo

పొలానికి రైతు.. రైతులకు సీఎం కేసీఆర్‌ కాపలా.. : మంత్రి నిరంజన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా రైతుల గొంతు కోస్తోందని, పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అబద్ధాలు చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రైతుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యతను విస్మరించిన పీయూష్‌గోయల్‌ పార్లమెంటును తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యతేనని స్పష్టం చేశారు.

రాష్ట్రం నుంచి బియ్యం తరలించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌, జిల్లాల కలెక్టర్లు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల బియ్యాన్ని వాళ్లు తీసుకెళ్లకుండా రాష్ట్రం పంపలేదని అనడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేసిందంతా బాయిల్డ్‌ రైసేనన్న విషయం తెలవకపోవడం బీజేపీ నేతల అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గత ఏడేండ్లలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో పండిన మొత్తం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేసిందని ఆయన గణాంకాలతో వివరించారు. నిజానికి దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రాలకు సంబంధం ఉండదని, ఏర్పాట్లను మాత్రమే పర్యవేక్షిస్తాయని వివరించారు. ఈ విషయాన్ని కేంద్రం మరచి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగం కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నా.. రెండు జాతీయ పార్టీలు తమ బాధ్యతను విస్మరించాయని, ఆ పార్టీ అగ్రనేతలు సైతం మౌన పాత్ర వహించారని మండిపడ్డారు.

యాసంగిలో వాణిజ్య పంటలు పండించండి :

కేంద్ర సర్కారు ఎన్ని కుట్రలు చేసినా వానకాలంలో తడిసిన, రంగుమారిన ధాన్యంతో సహా పంట మొత్తం కొనుగోలుచేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వచ్చే యాసంగిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని పునరుద్ఘాటించారు. రైతులు వరి పండించి, ఇబ్బందులకు గురికావద్దని, ఇతర పంటలు సాగుచేయాలని ఆయన సూచించారు. ఇతర పంటలు పండించే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అన్నీ సమృద్ధిగా ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనిపై జిల్లాలవారీగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారని, రైతులు ఆ మేరకు ఇతర పంటలు వేసుకోవటానికి సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

పొలానికి రైతు.. రైతులకు సీఎం కేసీఆర్‌ కాపలా:

రైతులు తమ పొలానికి కాపలా ఉన్నట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు కాపలాగా ఉంటున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల ముఖాల్లో శాశ్వత సంతోషం చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఓడరేవులు మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెడుతున్నట్టే.. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎఫ్‌సీఐని కూడా అమ్మే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్‌ రెండేండ్ల నుంచే పంటల మార్పిడిపై రాష్ట్ర రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని వివరించారు. దీంతో రైతుల్లో కూడా చాలా మార్పు వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎస్‌ వాణీదేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *