తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేసే కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హమాలీలు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లకు, వారి పిల్లలకు అనేక పథకాలు ప్రకటించింది. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బుధవారం వ్యవసాయ, మార్కెట్ కమిటీ కార్మికులతో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్న మంత్రి కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. మిగతావి వేరే శాఖలతో ముడిపడి ఉన్నాయని, వాటిని అధికారులతో కమిటీ వేసి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హమాలీలుగా పనిచేసే మీ పిల్లలు హమాలీలుగానే బతకాలా? వాళ్లకు మంచి చదువులు చెప్పించాల్సిన బాధ్యత మనపై లేదా? అందుకే మీరు అడగకపోయినా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ కమిటీలలో పనిచేసే కార్మికుల ఆడపిల్లలకు చదువు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే కార్మికులందరూ కలిపి సుమారు 20వేలమంది ఉంటారు. వాళ్ళందరికి ఇన్సూరెన్స్ పథకం వర్తించేలా చేస్తాం.. జూలై నెల నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ ఉంటుందని, ప్రత్యేక కమిటీ నియామకం ద్వారా కార్మికశాఖతో చర్చించి వచ్చే ఏడాది నుండి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామని మంత్రి చెప్పారు.
ఆడపిల్లలు ఇంటర్ చదివితే ఏడాదికి రూ. 2 వేలు, డిగ్రీ చదువుకుంటే ఏడాదికి రూ. 3 వేలు, పీజీ చేస్తే ఏడాదికి రూ. 5 వేల భ్రుతి అందుతుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే వారి కోచింగ్ కోసం రూ. 50 వేలు.. ఐఏస్, ఐపీఎస్ కు సిద్ధమవుతూ ప్రిలిమ్స్ పాసైన వారికి రూ. లక్ష ఇస్తామని అన్నారు. సెక్యూరిటీ గార్డులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం పూర్తిగా అమలుచేస్తామని, రాష్ట్రంలోని 182 మార్కెట్ యార్డుల్లో విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల సౌకర్యాల రూపకల్పన, మార్కెటింగ్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా గుర్తింపు కార్డు జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు.
మార్కెట్ కొచ్చిన రైతుని ఇబ్బంది పెట్టొద్దని, రాత్రిపూట వచ్చినా సరే రైతుతో మంచిగా మాట్లాడి పంపించండని హరీష్ అధికారులకు సూచించారు. మీకు ఏదైనా సమస్యలు వస్తే నాతో కొట్లాడండి.. రైతు లేకపోతే మనం లేము.. రైతు ఆరుగాలం శ్రమించిన కష్టం ఒక్క వడగండ్ల వానతో ఆగమైతది. మిమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు రైతుని కాపాడండి అని మంత్రి అధికారులను కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న రైతుబంధు పథకం కింద సంవత్సరం పొడవునా పని దొరుకుతుందని అన్నారు. అనంతరం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ కింది స్థాయి కార్మికులతో ఒక మంత్రి సమీక్ష చేయడం తన సర్వీస్ లో రెండు మూడు సార్లకు మించి చూడలేదని, రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదిలోనే సమీక్ష జరపడం అభినందనీయం అని, మనకు మంచి సీఎం ఉన్నారు.. భవిష్యత్ అంతా మంచే జరుగుతుందని అన్నారు.