ఓటుకు నోటు కేసులో ఏసీబీకి రేవంత్ రెడ్డి రెడ్ హాండెడ్ గా దొరికిపోయాడని, అయినా ప్రజల కోసం త్యాగం చేసిన నాయకునికి చేసినట్లు ఊరేగింపు చేశారని వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి ఊరేగింపు చేశారని, జులుస్ తీయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అసలు రేవంత్ కిచ్చిందే షరతులతో కూడిన బెయిల్ అని, కొడంగల్ కెళ్ళి ఉండమంటే కేసీఆర్ ను విమర్శించాడని పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ హాండెడ్ గా దొరికిన దొంగలు కుట్రపూరితంగా కేసులు పెట్టారని అంటున్నారని, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని, బజారు రౌడీలా, గూండాల్లా మాట్లాడకూడదని సూచించారు.
టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని పోచారం అన్నారు. 30 ఏళ్ళు టీఆర్ఎస్ ను వెంటాడుతానని రేవంత్ రెడ్డి అన్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం 30 ఏళ్ళు అధికారంలో ఉంటుందన్నారు. సెక్షన్-8 పై చంద్రబాబు మాట్లాడుతుంటే తెలంగాణ బిడ్డగా రేవంత్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ కు నీళ్ళిచ్చే పాలమూరు ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడని పోచారం గుర్తుచేశారు.