mt_logo

హరితహారానికి 40 కోట్ల మొక్కలు సిద్ధం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం జూలై 3నుండి 10 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం చిలుకూరులో శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మూడేళ్ళలో 230 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొదటిదశలో సుమారు 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో  నియోజకవర్గంలో దాదాపు 30 నుండి 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకుంది. మొదటిదశ మొక్కలు నాటే కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 4,135 నర్సరీలలో సుమారు 39 కోట్ల 53 లక్షల మొక్కలు సిద్ధం అయ్యాయి.

ఈ నెల 3వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మేడిపల్లి, నారపల్లిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. 4వ తేదీ శనివారం హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో, 5న కరీంనగర్, ఆదిలాబాద్ లలో, 6వ తేదీ నిజామాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని అక్కడినుండి మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారని సీఎం కార్యాలయం తెలిపింది. ఇదిలావుండగా ఈనెల 5న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాదాద్రి పర్యటన ఉన్న దృష్ట్యా సీఎం కేసీఆర్ అదేరోజు ఉదయం కరీంనగర్ నుండి హెలికాప్టర్ లో యాదాద్రికి చేరుకుంటారు. యాదాద్రి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి తిరిగి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తిరిగి వెళ్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *