అర్హులైన వారందరికీ రైతుబంధు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు వేశామని తెలిపారు. ఈ రెండ్రోజుల్లో ఎకరా, రెండెకరాలు ఉన్నవారికి రూ.1820.75 కోట్లు జమ చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. రెండు రోజుల్లో మొత్తం 36.41 లక్షల ఎకరాలకు సాయం అందిందన్నారు. ప్రభుత్వం పదెకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు రూ.250 కోట్లేనని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు అబ్ధిదారుల్లో ఐదెకరాలు ఉన్న వారు 92.50 శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది వానాకాలంలో 68.10 లక్షల మందికి రైతుబంధు అందనుందని చెప్పారు. 9వ విడత రైతుబంధు కింద లబ్ధదారులకు రూ.7,508 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. గత ఎనిమిది విడతల్లో రూ.50.448 కోట్లు పంపిణీ చేశామని సూచించారు.

