తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి 126వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళులు అర్పించారు. సురవరం ప్రతాపరెడ్డి భాష, సాహిత్యము, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రాంత అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. సురవరం జీవిత చరిత్ర మూడో తరానికి తెలియాలని.. ఆయన కీర్తి చిరస్థాయిగా వెలగాలనే ఆకాంక్షతో ఆయన విగ్రహాన్ని వనపర్తిలో ఆవిష్కరించినట్లు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. సాహిత్యం నుంచి సైన్స్ వరకు సురవరం ప్రతాపరెడ్డి స్పృశించని అంశం లేదని, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సాంఘిక అంశాలను సునిశితంగా పరిశీలించి ప్రస్తావించారని తెలియజేశారు. ఆయన చేసిన సేవలు మరింత ప్రాచుర్యంలోకి రావాల్సిన అవసరం ఉందని, ఆయన రచనలను రెండు సంపుటాలుగా తీసుకొచ్చామని.. మూడో సంపుటాన్ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తీసుకొస్తామని అన్నారు. 1952లో సాధారణ ఎన్నికల్లో వనపర్తి శాసనసభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు, వనపర్తి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుండిపోతాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

