Mission Telangana

నానో యూరియా వాడమని రైతులకు పిలుపునిచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

శుక్రవారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా వాడాల్సిన ఆవశ్యకత సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భారతీయుడైన రమేష్ రాలియా కనుగొన్న నానో యూరియా ప్రపంచానికే ఆదర్శం అన్నారు. భారత రైతుల కోసం అమెరికా ఉద్యోగాన్ని వదులుకుని నానో యూరియా టెక్నాలజీని మన దేశంలోని ఇఫ్కో సంస్థకు రమేష్ అందించారని కొనియాడారు. 11 వేల మంది రైతుల పొలాలలో నానో యూరియాను ప్రయోగించి ఫలితాలు పరిశీలించి మార్కెట్ లోకి విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. తొలిసారి యూరియాను ద్రవరూపంలో నానో టెక్నాలజీలో అందుబాటులోకి తీసుకువచ్చారని, దీనివల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని అన్నారు.

దేశంలో పంటల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలయిందని, దేశంలోని జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన పద్దతులను అనుసరించడం మొదలుపెట్టారని మంత్రి అన్నారు. 1960 దశకంలో సాంప్రదాయ విత్తనాలను పక్కనపెట్టి అత్యధిక ఉత్పత్తి నిచ్చే ఆధునిక హైబ్రిడ్ విత్తనాలను లాల్ బహదూర్ శాస్త్రి పంజాబ్ లో మొదలు పెడితే… బాబూ జగ్జీవన్ రామ్ కొనసాగించారన్నారు. రైతులను ప్రోత్సహించి గోధుమలు సాగుచేయించి క్వింటాలుకు రూ.50 మొదటి సారి కనీస మద్దతుధర ప్రకటించగా… ఆ తర్వాత క్రమంగా దేశంలో 29 పంటలకు మద్దతుధర ఇవ్వడం జరుగుతోందన్నారు.

మానవాళికి, జీవరాశికి అవసరమైన ఆహారం అంతా ఈ భూమి నుండి ఉత్పత్తి కావాల్సిందేనని, మానవుడి యొక్క ఆహారాన్ని వ్యవసాయం అనే శాస్త్రీయ విధానం ద్వారా ఉత్పత్తి చేసే పద్దతి దాదాపు పది వేల ఏళ్ల క్రితమే మొదలయిందని, భారతదేశం ప్రాచీన వ్యవసాయ నాగరికత కలిగిన దేశమని మంత్రి తెలియజేసారు. పంటలు పండడానికి ప్రధానంగా భూమిలో పోషకాలు అవసరం కాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయని, కాని రసాయనిక ఎరువుల వాడకంలో సరయిన పరిజ్ఞానం రైతులకు గత ప్రభుత్వాలు కల్పించకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు వాడారనన్నారు. దీంతో భూమిలో పోషకాలు లోపించడం, అధికం కావడం అనే ప్రక్రియలు జరిగి నేలలు సారవంతాన్ని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి అవసరమైన పోషకాలు ఏమిటి ? ఎంత వాడాలి ? అన్నదానిపై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.

దేశంలో వినియోగించే 70 శాతం యూరియా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని అని తెలిపిన మంత్రి… అత్యధిక ఎరువులు, యూరియా వాడకం మూలంగా చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి దుష్పరిణామాలను అరికట్టడం, రైతాంగానికి మేలు చేయాలి అనే తలంపుతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ట్రేడర్లు, వ్యాపారులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులను నానో యూరియా వాడటం వైపు మళ్లించేందుకు సహకరించాలని కోరారు..

నానో యూరియా వాడకం మూలంగా మొక్కలకు పత్రహరితం ఎక్కువగా అంది పంట వేగంగా ఎదుగుతుందని మంత్రి వివరించారు. అలాగే యూరియా గడ్డకట్టడం, రవాణా ఖర్చులు అధిగమించడం, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతులు తగ్గించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానమని, సాధారణ యూరియా కేవలం 30 నుండి 50 శాతం మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుండగా…నానో యూరియా 80 శాతం వరకు పనిచేసి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుందని సూచించారు. తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శమని, నానో యూరియా వాడకంతో మరోసారి దేశానికి దిక్సూచిలా నిలబడాలని రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి పిలునిచ్చారు. ఈ సదస్సులో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమీషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *