mt_logo

తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేస్తోంది : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేస్తే, కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణను గాలికి వదిలేసింది అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ లో ప్రారంభమైన ‘నదుల పరిరక్షణ’ జాతీయ సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని, ప్రసంగించారు. నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసిందని… నదులకు, నాగరికతకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో నదులు సజీవమయ్యాయని, అందుకు గోదావరి నది సాక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం నదులు కలుషితమై పోతున్నా పట్టించుకోవడం లేదని, ఏ విధమైన సంరక్షణ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నదులు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాల్లోని చెత్తను వాగుల్లో కలపకుండా ప్రతీ గ్రామంలో చెత్తను సేకరించి ప్రత్యేక డంపింగ్ యార్డుల్లో నిల్వ చేసి, దాన్ని ఎరువుగా మార్చి, రైతులకు అందిస్తున్నామని మంత్రి అన్నారు. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పచ్చదనం కోసం నర్సరీలను పెంచుతోందని పేర్కొన్నారు. పచ్చదనం వల్ల కూడా నదులు కలుషితం కాకుండా కాపాడవచ్చని, తెలంగాణ వచ్చిన తర్వాతి ఈ ఏడు సంవత్సరాల్లో మూడు శాతం పచ్చదనం పెరగడానికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన హరితహారమే కారణమన్నారు. అతి తక్కువ కాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో, సాగు విస్తీర్ణం పెరిగి, వలసలు పూర్తిగా తగ్గిపోయి ఇపుడు పంటకోతల సమయంలో తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుండి వలసలు వస్తున్నారని అన్నారు. నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ఎన్జీవోలతోపాటు ఇతర సంస్థలు కూడా పాటు పడాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *