mt_logo

రేపు కరీంనగర్లో 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

ఈ నెల 17న‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తార‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. బుధ‌వారం ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడారు. క‌రీంన‌గ‌ర్ న‌గర అభివృద్ధిలో భాగంగా రూ.615 కోట్ల‌తో చేప‌ట్టే వివిధ అభివృద్ధి ప‌నుల‌కు రాష్ట్ర మున్పిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తార‌ని, అనంతరం శ‌బ‌ర్మ‌తి త‌ర‌హాలో రూ. 410 కోట్ల‌తో చేప‌ట్టే మానేరు రివ‌ర్ ఫ్రంట్ ప‌నుల‌కు కూడ భూమి పూజ‌చేస్తార‌ని తెలిపారు. ఇందులో అధిక‌శాతం ప‌నుల‌కు ఇప్ప‌టికే టెండ‌ర్లు పూర్తి అయిన‌ట్లు పేర్కొన్నారు. మానేరు రివ‌ర్ ఫ్రంట్‌ను వ‌చ్చే 18 నెల‌ల్లో పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఆలాగే రూ.615 కోట్ల కార్పొరేష‌న్ నిధుల‌తో చేప‌ట్టే ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తిచేస్తామ‌న్నారు. గ‌త యాభైఏళ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధి కేవ‌లం ఆరేండ్ల‌లో చేసి చూపించామ‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండండ‌ద‌ల‌తో క‌రీంన‌గ‌ర్‌ను రాష్ట్రంలోనే నంబ‌ర్ 2 సిటీగా మార్చుతున్నామ‌ని గంగుల క‌మలాక‌ర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *