దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. కొన్ని కంపెనీల కుమ్మక్కు వల్లే స్టీల్, సిమెంటు ధరలు పెరిగాయని… ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
బయటి రాష్ట్రాల వాళ్లు బతుకుదెరువు కోసం తెలంగాణకు వస్తున్నారని, కానీ మనవాళ్లు దుబాయ్ పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించేలా క్రెడాయ్ ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన సాయం ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణపై క్రెడాయ్ దృష్టిపెట్టాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లో హైదరాబాద్‌కు కొత్త మాస్టర్‌ప్లాన్ తయారుకానుందని తెలిపారు. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు కట్టుకుంటే రూ.3 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే విపక్షాలకు తెలుసునని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఏం చేస్తారో విపక్ష నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏడు శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం పూర్తిచేశామన్నారు. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తున్నామని, భవిష్యత్ తరాల కోసం పెట్టే పెట్టుబడిని అప్పులుగా చూడరాదని వెల్లడించారు.