తెలంగాణ ఏర్పడినప్పటినుండి ఇప్పటివరకూ ఐటీ అనుబంధ రంగంలో 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎనిమిదేళ్లలో ఇన్ని భారీ పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసి, విజయం సాధించిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ ద్వారా పారదర్శక అనుమతుల వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుస కట్టాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సోమవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన 2014 సంవత్సరం నుండి గతేడాది నవంబర్ వరకు తెలంగాణకు 3.30 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు కేవలం టీఎస్‌ఐపాస్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల ద్వారా వచ్చినవేనని, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, మైనింగ్, ఆతిథ్య రంగాల్లో వచ్చినవి ఇంకా వేలకోట్లు ఉన్నాయని, వాటన్నిటిని త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. కాగా ఈ పెట్టుబడులతో 22.50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని, పరోక్షంగా కూడా లక్షల మందికి ఉపాధి లభించిందని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.
అత్యంత అభివృద్ధి చెందుతున్న 14 రంగాలను గుర్తించి సరైన ప్రణాళిక ద్వారా ఇంతటి భారీ పెట్టుబడులు సాధించామని మంత్రి అన్నారు. ప్రతీ రంగానికి ఒక స్పెషల్ నియమించి, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించామని కేటీఆర్ అన్నారు. కాగా తెలంగాణకు ఇన్ని పెట్టుబడులు రావడానికి కృషి చేసిన అధికారులకు మరియు ఆయా టీమ్ సభ్యులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.