mt_logo

రాజకీయాలకు తావివ్వని సత్యాగ్రహం ఎంతో నచ్చింది : మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా లోని బాసర ఆర్జీయూకేటీ లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. కొంత కాలంగా బాసర ఐఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటంతో పాటు స్టూడెంట్స్ తో నేరుగా మాట్లాడడానికి ఇవాళ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ బాసరకు వెళ్లి వర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

బాసర లో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు చేసిన విధానం తనకు ఎంతో నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. చాలా ఓర్పుగా ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇవ్వకుండా తమ సమస్యలను చెప్పిన తీరు బాగుందన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు వెళ్లాలన్న ఉద్దేశంతోనే వర్షంలోనూ స్టూడెంట్స్ చేసిన నిరసనతో వారిపై గౌరవం పెరిగిందన్నారు. ఐతే 10 వేల మంది ఉండే క్యాంపస్ లో ఒక్కసారిగా సమస్యలు పరిష్కారం కావని ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు తీరుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు నవంబర్ లో ల్యాప్ టాప్ లు, అదనంగా 50 మోడ్రన్ క్లాస్ రూములు, మిని స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. పుడ్ విషయంలో మరింత క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అదే విధంగా విద్యార్థులు కూడా క్యాంపస్ తమదన్నట్టుగా భావించాలని సూచించారు. ప్రభుత్వానికి వసతులు కల్పించే బాధ్యత ఎంత ఉందో…దాన్ని కాపాడే బాధ్యత విద్యార్థులపై అంతకన్నా ఎక్కువగా ఉందని కేటీఆర్ అన్నారు.

స్టూడెంట్స్ కేవలం ఉద్యోగం కోసమే చదువు అన్నట్లుగా ఉండకూడదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగం చేయటం కాదు…ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పం అందరిలో రావాలని వారిలో మోటివేషన్ నింపే ప్రయత్నం చేశారు. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు చిన్న ఇన్నోవేషన్ ఐడియాతోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అదే విధంగా విద్యార్థులంతా ఇన్నోవేషన్, పారిశ్రామిక వేత్తలుగా మారటానికి ప్రయత్నించాలన్నారు. మూస పద్దతిలో డాక్టరో, ఇంజనీరో, ఉద్యోగం వస్తే చాలన్నట్టుగా ఉండకూడదని…మంచి సంకల్పంతో రిస్క్ చేసైన సరే జీవితం ఉన్నత స్థానానికి చేరాలని కోరారు. విద్యార్థుల్లో ఇన్నో వేషన్ ఆలోచనలు పెంచేందుకు టీ హబ్ తరహాలో బాసర క్యాంపస్ లోనూ ఒక చిన్న హబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *