mt_logo

సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్ ఏర్పాటు చేయాలి : కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్

సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్‌) కింద సిరిసిల్లలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఆదివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. గతంలో ఇదే అంశంపై ఏడుసార్లు లేఖలు రాశామని, వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసినా కూడా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తిని వ్యక్తంచేశారు.

చేనేతకు పునరుజ్జీవనం కల్పించాం :

సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపిన కేటీఆర్.. చేనేత, జౌళిరంగం సర్వతోముఖాభివృద్ధికి, నేతన్నల శ్రేయస్సుకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థతోపాటు, శిక్షణ పొందిన కార్మికులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నారని వెల్లడించారు. 40% ఇన్‌పుట్‌ సబ్సిడీ వేజ్‌ కాంపెన్సేషన్‌ స్కీమ్‌, థ్రిఫ్ట్‌ ఫండ్‌ వంటి పథకాలతో చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు నిరంతరం పని కల్పించి, ఆదాయం పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. తమ కార్యక్రమాలతో పరిశ్రమ పునరుజ్జీవం దిశగా సాగుతున్నదని, నేత కార్మికుల ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు.

కేంద్ర సహకారం శూన్యం :

చేనేత, జౌళి రంగానికి సిరిసిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్నపటికీ.. తెలంగాణకు కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ సహకారం అందడం లేదని కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో మన దేశం చిన్న దేశాలతో కూడా పోటీ పడలేక పోతున్నదని పేర్కొన్నారు. టెక్స్‌టైల్‌ రంగంలో రాష్ట్రం ఇప్పటికే భారీగా పెట్టుబడులు ఆకర్షించిందని, ఇతర దేశాలతోనూ తెలంగాణ పోటీ పడుతున్నదని వివరించారు. చేనేత, జౌళి రంగానికి అదనపు బడ్జెట్‌ను కేటాయించడమే కాకుండా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను చేపట్టామని గుర్తుచేశారు. కేంద్రం సరైన వ్యవస్థ, వనరులులేని రాష్ట్రాలకు సహాయం చేస్తూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహించకపోవటం అత్యంత నష్టదాయకమన్నారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ఆలస్యం చేయకుండా తక్షణమే క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *