mt_logo

రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ లోగల ఉద్యాన శిక్షణా సంస్థలో ఏర్పాటు చేసిన అన్ని జిల్లాల వ్యవసాయాధికారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వాణిజ్య పంటలు వేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని, అధికారులు మనసుపెట్టి చేస్తే పంటల మార్పిడి అసాధ్యమేమీ కాదన్నారు. ముందు వరి సాగు నుండి రైతుల దృష్టి మళ్లించాలని, ఒకసారి రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని తెలియజేసారు. వరిమళ్ళలో మినుములు, పెసర్లు వేయడం మూలంగా వానాకాలం ఎరువుల వాడకం తగ్గించవచ్చని సూచించిన మంత్రి నిరంజన్ రెడ్డి… తెలంగాణ భూముల్లో డి.ఎ.పి వాడాల్సిన అవసరం లేదన్నారు. పంటలకు ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించేలా రైతులను చైతన్యం చేసి తద్వారా పంట పెట్టుబడి తగ్గేలా చూడాలన్నారు.

అంతర్జాతీయంగా ఆముదాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. మనదేశంలో కుసుమలు, ఆముదాల ఉత్పత్తి సరిగా లేదన్నారు. వెంటనే వీటి సాగు మొదలు పెట్టేలా రైతులను చైతన్యం చేయాలని, అలాగే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. యాసంగిలో వరి సాగు వద్దనే పరిస్థితి రావడం బాధాకరమని, దేశంలో ఆహారాధాన్యాలను సమతుల్యం చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా అత్యధికంగా వరి తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుందని, కానీ కేంద్ర ప్రభుత్వ ముందుచూపు లేని కారణంగా ఇపుడు రైతులు వరికి దూరంగా ఉండాల్సిన స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కంటే అధిక లాభం చేకూర్చే మరియు మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పంటలైన పప్పుగింజలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయ పంటలు వేసేలా రైతులకు వివరించేందుకు రాష్ట్రస్థాయి బృందాలను తయారు చేయాలని తెలిపారు.

రైతువేదికలలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసుకొని.. రైతువేదికల స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయరంగంలో మార్పులపై అనేక సమీక్షలు నడుస్తూనే ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ.. రైతుకు లాభం చేకూర్చడమే అంతిమ లక్ష్యం అవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి పంటలమార్పిడి, వైవిధ్యీకరణపై లఘుదీపిక, గోడపత్రిక, రైతువేదికల వ్యాసదీపిక విడుదల చేశారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వివిధ జిల్లాల వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *