సోమవారం మెటావర్స్‌లో ‘తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేమ్‌వర్క్’ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి, తాజాగా స్పేస్ టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. హైదరాబాద్ లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమయ్యే వాతావరణం ఉందని, గ్లోబల్ సప్లయ్ చైన్‌లో కూడా ఉన్నందున స్పేస్ హబ్‌గా మారేందుకు నగరానికి అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు 30 శాతానికి పైగా భాగాలను ఇక్కడి ఎస్‌ఎంఈలే సరఫరా చేశాయని గుర్తు చేశారు. ధ్రువ, స్కైరూట్ ఏరోస్పేస్ వంటి అత్యుత్తమ స్టార్టప్‌లూ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పారు. స్పేస్‌టెక్ పరిశ్రమలో ఉపగ్రహాల వంటి అప్‌స్ట్రీమ్ విభాగాలు, ఐప్లెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి వేగంగా వృద్ధి చెందే ఆస్కారం ఉన్నదని అన్నారు. జాతీయ విధానాల మద్దతు, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆవిష్కరణలకు సహకారం అందిస్తుందని తెలిపారు. స్పేస్ టెక్‌లో విదేశాల్లో ఎంతోమంది నూతన ఆవిష్కరణలు చేశారని, అందులో ఎక్కువ మంది మన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లే ఉన్నారని చెప్పారు. భారతీయ శాస్త్రవేత్తలు మన దేశంలోనే సాంకేతికతను నిర్మించి, ప్రపంచానికి ఎగుమతి చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. దేశంలో అంతరిక్ష పరిశ్రమ 2026 నాటికి 558 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా ఉన్నదని, ఇందులో మనం ఎక్కువ వాటాను సాధించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.
మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ తదితర రంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించినట్టు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 1,500 స్టార్టప్స్ మెంటార్‌షిప్ సహకారాన్ని సాధించాయని, రూ.1,800 కోట్లకుపైగా నిధులు సమీకరించాయని అన్నారు. 2016లో తెలంగాణ ఐసీటీ పాలసీని ప్రవేశపెట్టి నేడు ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై దృష్టి సారించామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, డ్రోన్స్, క్లౌడ్ తదితర వాటిని అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఔషధాల రవాణా కోసం డ్రోన్ ఆధారిత మెడిసిన్ ఫ్రమ్ స్కై, వ్యవసాయ ఆధారిత స్టార్టప్స్ వృద్ధికి సాగు -బాగు, 31 జిల్లాల్లో పచ్చదనం పెంపునకు 12,000 హెక్టార్లలో ఏరియల్ సీడింగ్ కోసం హరా-భరా, లైఫ్ సర్టిఫికెట్ల జారీ, డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ తదితరాల కోసం రియల్ టైం డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ (ఆర్‌టీడీఏఐ), స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఈ-ఓటింగ్ సొల్యూషన్స్ తదితర ప్రాజెక్టులు చేపట్టామని గుర్తు చేశారు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్(టీ-ఏఐఎం), మెంటార్‌షిప్ ప్రోగ్రామ్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
స్పేస్‌టెక్ పర్యావరణ వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ, ప్రపంచంలోనే స్పేస్ టెక్నాలజీలో తెలంగాణను వన్-స్టాప్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని కేటీఆర్ అన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఇస్రో, ఇన్-స్పేస్, నీతిఆయోగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), హైదరాబాద్‌కు చెందిన ఐఐటీ, ఐఐఐటీ, ఏఆర్‌సీఐ, ఎన్‌ఆర్‌ఎస్‌సీ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అందరం కలిసి భారత అంతరిక్ష సాంకేతిక రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకొని వెళ్దామని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న యువ రాష్ట్రమని, అనతి కాలంలోనే స్టార్టప్స్ స్టేట్‌గా గుర్తింపు పొందిందని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ-హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్, రిసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), టీ-వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఇస్రో చైర్మన్ సోమనాథ్, ఇన్-స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు పలువురు పరిశ్రమ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.